మార్చి 1 నుంచి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ విధానం
విజయవాడ : వైద్యరంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి ప్రజలకు మెరుగైన
సేవలందిస్తోన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 1 నుంచి రాష్ట్రంలో
ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయనున్నట్లు రాజ్యసభ
సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ
మేరకు ట్విట్టర్ వేదికగా శనివారం పలు అంశాలు వెల్లడించారు. ఈ విధానం కింద
రక్తపోటు, మధుమేహం బాధితుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో పూర్తిస్థాయిలో సదుపాయాలు
కల్పించనున్నట్లు తెలిపారు. ఉద్దానంలో తాగునీటి కోసం 700 కోట్లు ఖర్చు
చేస్తోందని అన్నారు. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు విధిగా ఆసుపత్రులు
సందర్శించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు తెలిపారు.
జగన్ పరిపాలన దేశానికే ఆదర్శం
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సుపరిపాలన దేశానికే ఆదర్శంగా
నిలుస్తోందని పలు రంగాల్లో దేశంలోనే నెంబర్ 1 గా నిలిచిందని విజయసాయి రె్డ్డి
అన్నారు. నిజాయితీలో ఏపీ పోలీస్ దేశంలోనే టాప్ లో నిలిచారని, గ్రామ, వార్డు
సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, పెట్టుబడుల్లో, ఎస్సీ, ఎస్టీ
సబ్ ప్లాన్ అమలులో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని పలు నివేదికలు
వెల్లడించినట్లు పేర్కొన్నారు
వన్య ప్రాణులు సంరక్షణ చట్టాలు పాఠ్యాంశాల్లో చేర్చాలి
వన్యప్రాణులకు వేధింపులు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయని విజయసాయి రెడ్డి
అన్నారు. వాటి జోలికి పోవడం, రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం ద్వారా అవి ఆందోళనకు
గురై తిరిగి మనుషులపై దాడులకు దిగుతున్న సందర్బాలు పెరుగుతున్నాయని అన్నారు.
వన్యప్రాణుల చట్టాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతోనే వీటిని
అరికట్టవచ్చని అభిప్రాయపడ్డారు. స్కూలు పాఠ్యపుస్తకాల్లో వన్యప్రాణుల చట్టాలు
పాఠ్యాంశాలుగా చేర్చాలని ఆయన కోరారు.