తెనాలి : కార్పొరేషన్ల పేరిట కులాలను విడదీసి వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాలను
వంచించిందని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
కళ్ళు గీత కార్పొరేషన్ల రద్దు చేసి కల్లు గీత కార్మికుల సంక్షేమానికి తూట్లు
పొడిచిందన్నారు. కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధిగా జనసేన
పార్టీ కృషి చేస్తుందన్నారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ కల్లు గీత వృత్తిదారుల
సంక్షేమ సంఘం నాయకులు తెనాలిలో మనోహర్ ని కలిశారు. వైసీపీ ప్రభుత్వంలో తమ
వృత్తిదారులు పడుతున్న ఇబ్బందులు ఆయనకు వివరించారు. కల్లు గీత వృత్తిదారుల
సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన గీత కార్పొరేషన్ల రద్దు, రూ. 500 కోట్ల నిధులు
కేటాయింపు లేకపోవడం, ప్రాంతాల వారీగా మూడు నీరా ప్రాజెక్టులు ఏర్పాటు
చేయకపోవడం, చెట్లు పెంచుకునేందుకు మండలాల వారీగా స్థలాల కేటాయింపుతో చెట్ల మీద
నుంచి పడిపోయిన వారికి పరిహారం చెల్లించకపోవడం లాంటి సమస్యలను మనోహర్ దృష్టికి
తీసుకువెళ్లారు. గీత కార్మికుల సమస్యలపై చర్చించేందుకు త్వరలో జనసేన పార్టీ
అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా
మనోహర్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కల్లు గీత వృత్తిదారుల సంక్షేమ సంఘం రాష్ట్ర
అధ్యక్షులు చిల్లపల్లి నరసింహారావు ఆధ్వర్యంలో సంఘం నాయకులు కంచర్ల
వెంకటేశ్వరరావు, పరిశే శ్రీనివాసరావు, మందా రామకృష్ణ, మురాల తిరుపతిరావు
తదితరులు పాల్గొన్నారు.