గుంటూరు : ఎన్ని గొప్ప చట్టాలు, సంస్కరణలు తీసుకొచ్చినా ఆచరణలో పెట్టే
వ్యక్తికి హృదయం లేనప్పుడు ఎన్ని చట్టాలు చేసినా వృథాయేనని జనసేన పార్టీ
అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దాదాపు 22 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ
సామాజిక వర్గాలు ఇప్పటికీ నిధులు కోసం దేహీ అంటూ అడుక్కోవడం బాధాకరమన్నారు.
అణగారిన వర్గాలు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టంలో ఉన్న లోపాలను
సవరించి, సబ్ ప్లాన్ నిధులను దళిత, గిరిజనుల సంక్షేమానికి, అభ్యున్నతికి ఖర్చు
చేస్తామని హామీ ఇచ్చారు. బుధవారం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ వైసీపీ సర్కార్
నిర్లక్ష్యంపై రాష్ట్ర స్థాయి సదస్సు మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగింది.
దళిత మేధావులు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘాల నేతలు సబ్ ప్లాన్ నిధుల
కేటాయింపులపై జరిగిన అన్యాయంపై మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ
“సమాజాన్ని ఎప్పుడూ ఒక్క కోణం నుంచి చూడకూడదు. సమగ్రంగా అన్ని కోణాల నుంచి
విశ్లేషించాలి. అణగారిన వర్గాలు వివక్షతకు గురైనప్పుడు కలిగే బాధ మనకు
తెలియాలంటే మనం కూడా వివక్షతకు గురి కావాలి. గతంలో విదేశాలకు వెళ్లినప్పుడు
తెల్ల తోలు లేని కారణంగా వివక్షతకు గురయ్యాను. విమానంలో నీళ్లు ఇవ్వమని అడిగిన
ఒక బ్రిటిష్ మహిళ పట్టించుకోలేదు. పైలట్ ను పిలిచి మందలించడంతో ఆమె క్షమాపణ
చెప్పింది. మరో భారతీయ ప్రయాణికులకు ఇలాంటి పరిస్థితి రానివ్వకూడదని ఆ రోజు
నేను అలా చేయాల్సి వచ్చింది.
పారదర్శకంగా అమలు చేస్తాం
జగన్ రెడ్డి జైలుకు వెళితే ఆయన కోసం ప్రార్థనలు, ఉపవాసదీక్షలు చేశారు. మీ
కుటుంబంలో వ్యక్తిగా భావించి మీరు అంత చేస్తే ..ఆయన అండగా నిలబడకపోగా ఎస్సీ,
ఎస్టీలపైనే అట్రాసిటీ కేసులు పెట్టారు. ఎంతసేపు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు
చేయాలనే కోణంలోనే మన పోరాటం ఉంది తప్ప.. అధికారానికి చేరువవ్వాలనే ఆలోచన లేదు.
ఆ కోణంలో ఆలోచించనంత కాలం మన పరిస్థితుల్లో మార్పు రాదు. జనసేన అధికారంలోకి
వస్తే అద్భుతాలు చేస్తామని చెప్పం కానీ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను
పారదర్శకంగా అమలు చేస్తాం. చట్టంలో లోపాలను సవరించి నిధులు దారి మళ్లకుండా
చూస్తాం.