విజయవాడ : ప్రజాస్వామ్య మనుగడకు ఓటుహక్కే కీలకమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు
వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 13వ జాతీయ ఓటర్ల
దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రభ కాలనీ జనహిత సదనము నుంచి అజిత్ సింగ్
నగర్ అంబేద్కర్ విగ్రహం వరకు బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ
కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి మల్లాది
విష్ణు పాల్గొన్నారు. కుల, మత, వర్గ బేధం లేకుండా ప్రతీ ఒక్కరికీ మన రాజ్యాంగం
ఓటుహక్కు కల్పించిందని.. దానిని సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత పౌరులపై
ఉందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఓటర్లకు వారి హక్కులు, బాధ్యతల గురించి
అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకురావడమే జాతీయ ఓటర్ల దినోత్సవ ముఖ్య
ఉద్దేశమని తెలియజేశారు. ఓటు నమోదు నిరంతర పక్రియ అని.. అర్హత కలిగిన వారందరూ
బూత్ లెవల్ ఆఫీసర్ల ద్వారా తమ ఓటును నమోదు చేసుకోవాలని వెల్లడించారు. వీరికి
అవగాహన కల్పించడంలో సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు కీలకపాత్ర పోషించాలన్నారు.
అలాగే 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావడం కర్తవ్యంగా భావించాలని
సూచించారు. సెంట్రల్ నియోజకవర్గంలో 257 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. 2,65,742
మంది ఓటర్లు ఉన్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. వీరిలో 1,63,000 మంది
ఆధార్ తో అనుసంధానం చేసుకోగా.. మిగతా వారు కూడా వీలైనంత త్వరగా అనుసంధానం
చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఓటరు జాబితాకు సంబంధించి అభ్యంతరాలు, పేర్లు,
చిరునామాల సవరణకు వెసులుబాటు ఉందని.. ఈ అవకాశాన్ని ఓటర్లందరూ
సద్వినియోగపరచుకోవాలని కోరారు. అనంతరం ఉత్తమ బీఎల్ఓలకు ఎమ్మెల్యే చేతులమీదుగా
అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో నార్త్ తహసీల్దార్ దుర్గాప్రసాద్,
ఎలక్షన్ డీటీ(సెంట్రల్) సుమతి, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ఎండి షాహినా
సుల్తానా హఫీజుల్లా, ఇసరపు దేవీ రాజారమేష్, నాయకులు అలంపూర్ విజయ్, అఫ్రోజ్,
ఉమ్మడి వెంకట్రావు, కాళ్ల ఆదినారాయణ, దేవిరెడ్డి రమేష్ రెడ్డి, బెజ్జం రవి,
ఆర్.ఎస్.నాయుడు, తోపుల వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.