విజయవాడ : అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపుమేరకు రాష్ట్ర కాంగ్రెస్
ఆధ్వర్యంలో ఈనెల 26 వ తేదీ నుండి మార్చి నెల 26 వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో జరగనున్న “హాథ్ సే హాథ్ జోడో అభియాన్” (చేయిచేయి కలుపుదాం –
రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుద్దాం) పాదయాత్రలో పాల్గొని విజయవంతం
చేయవలసినదిగా ఏఐసిసి అధికార ప్రతినిధి డాలీ శర్మ, ఎపిసిసి అధ్యక్షులు గిడుగు
రుద్రరాజు కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. అఖిలభారత కాంగ్రెస్ కమిటీ
ఆదేశాల మేరకు బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విచ్చేసిన ఆమె మొదటగా
రాష్ట్ర కార్యాలయంలో వున్న ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం
ఎపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు తో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొని
హాథ్ సే హాథ్ జోడో అభియాన్ పోస్టర్ విడుదల చేసారు. బిజెపి ప్రభుత్వం ప్రజా
శ్రేయస్సు గాలికొదిలేసి కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తోందని, దేశవ్యాప్తంగా
నిరుద్యోగం, అప్పులు పెరిగిపోయి ప్రజా జీవితాలు అస్థవ్యస్థమైపోయాయని
కేంద్రప్రభుత్వం పై మండిపడ్డారు. దేశ సమైక్యత కోసం రాహుల్ గాంధీ చేపట్టిన
భారత్ జోడో యాత్ర దేశ వ్యాప్తంగా విశేష ప్రజాదరణ చూరగొందని, ఇదే స్ఫూర్తిని
కొనసాగిస్తూ హాథ్ సే హాథ్ జోడో అభియాన్ ద్వారా ప్రజలకు మరింత దగ్గర
అవనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎపిసిసి ఉపాధ్యక్షులు ధనికుల మురళి
మోహన్, ఎపిసిసి లీగల్ సెల్ అధ్యక్షులు వి.గురునాధం, నగర కాంగ్రెస్ అధ్యక్షులు
నరహరశెట్టి నరసింహ రావు, కొలనుకొండ శివాజీ, మీసాల రాజేశ్వరరావు, మేడా
సురేష్, పోతరాజు ఏసుదాసు, బైపూడి నాగేశ్వర రావు, మహమ్మద్ బేగ్ తదితరులు
పాల్గొన్నారు.