విజయవాడ : ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల ఆశీస్సులే కొండంత బలమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. బుధవారం 23 వ డివిజన్ 93 వ వార్డు సచివాలయం పరిధిలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి ఆత్మకూరు సుబ్బారావు, కోఆర్డినేటర్ ఒగ్గు విక్కీతో కలిసి ఆయన పాల్గొన్నారు. సూర్యారావుపేట లోని వేమూరి వారి వీధి, జడగం వారి వీధులలో విస్తృతంగా పర్యటించి 249 ఇళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులకు ప్రజల నుంచి ఆత్మీయ స్వాగతం లభించింది. తమ ఇంటికి విచ్చేసిన ఎమ్మెల్యేని ప్రజలు సాదరంగా ఆహ్వానించి ఆప్యాయంగా పలకరించారు. పుష్పగుచ్ఛాలతో ఘనంగా సత్కరించారు. గత మూడున్నరేళ్లలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై ప్రజలలో గట్టి నమ్మకం ఏర్పడిందని మల్లాది విష్ణు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నగదు బదిలీలు గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయలేదని పేర్కొన్నారు.
ప్రాంత సమగ్రాభివృద్ధికి విశేష కృషి
తెలుగుదేశం హయాంలో ప్రతిపక్ష కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహించే డివిజన్లను పూర్తి నిర్లక్ష్యానికి గురిచేశారని మల్లాది విష్ణు ఆరోపించారు. కానీ ఈ ప్రభుత్వంలో పార్టీలకతీతంగా అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నట్లు వివరించారు. ముఖ్యంగా గత టీడీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురై అభివృద్ధికి నోచుకోని ఈ ప్రాంతం.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఓ మోడల్ డివిజన్ గా రూపుదిద్దుకుంటోందని తెలిపారు. గత మూడున్నరేళ్ల కాలంలో డివిజన్లో రూ. 3.25 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. గోవిందరాజులనాయుడు వీధి, విష్ణువర్థన్ రావు వీధి, కాంగ్రెస్ ఆఫీస్ రోడ్డు, నరసింహనాయుడు వీధులలో దాదాపు రూ. కోటి వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రహదారులను ఇటీవల ప్రారంభించుకున్నట్లు వెల్లడించారు.