గుంటూరు : ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ఖర్చు చేసిన నిధుల వాస్తవ లెక్కలపై చర్చకు సిద్ధమా అని మంత్రి ఆదిమూలపు సురేష్ సవాల్ విసిరారు. గత టీడీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం గత టీడీపీ ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసిందో ఆ పార్టీలో మంత్రులుగా పనిచేసిన వారికైనా పూర్తిగా తెలుసా అని ప్రశ్నించారు. చంద్రబాబు తన హాయంలో ఐదేళ్లలో ఎస్సీల కోసం చేసిన ఖర్చు కేవలం రూ.33,635 కోట్లు మాత్రమేనన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 2019–23 మధ్య ఈ మూడున్నరేళ్లలో ఎస్సీల సంక్షేమం కోసం రూ.48,898 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. అంటే గత ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన ఖర్చు కంటే, మూడున్నర ఏళ్లలోనే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.15,274 కోట్లు అదనంగా ఖర్చు చేసిందన్నారు.
ఎస్సీ, ఎస్టీల సంక్షేమమే మా అజెండా
ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ ను మరో పదేళ్లు పొడిగించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో పేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లో సంతోషం వెల్లి విరుస్తోందని మంత్రి ఆదిమూలపు సరేష్ పేర్కొన్నారు. సీఎం జగన్ నిర్ణయంతో దళితులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుంటే టీడీపీ మాత్రం సబ్ ప్లాన్ గడువు పొడిగింపుపై విషం చిమ్ముతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు అన్ని రంగాల్లో రాణించేలా వారికి ఆర్థిక, విద్యా పరంగా వెసులుబాటును అందిస్తూ, సమాజంలో అసమానతలు తొలగించాలని తమ ప్రభుత్వం తపిస్తోందని వివరించారు.