శ్రీకాకుళం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సుపరిపాలనను
క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేస్తున్న వలంటీర్లపై ‘చంద్రబాబు & కో’కు
గుబులెందుకని వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు, మాజీ డిప్యూటీ సిఎం ధర్మాన
కృష్ణదాస్ ప్రశ్నించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ఒక
ప్రకటనని విడుదల చేస్తూ గ్రామ వలంటీర్ల వ్యవస్థపై ఎల్లో మీడియాలో రాస్తున్న
విషపు రాతలను రాష్ట్ర ప్రజలంతా ఛీ కొడుతున్నారని, ప్రజల కష్టసుఖాల్లో వారి
జీవితాల్లో విడదీయలేని భాగమైన ఈ వ్యవస్థపై దేశంలోని ఇతర రాష్ట్రాలు ప్రత్యేక
అధ్యయనాలు చేస్తూ తమ రాష్ట్రాల్లో ప్రవేశపెట్టాలని సన్నాహాలు చేయడం వారి
కళ్లకు కనిపించడం లేదా?నని ప్రశ్నించారు. బాబు పాలనలో జన్మభూమి కమిటీలు
ప్రజలను ఎలా దగా చేశాయో? ఎలా దోచుకున్నాయో? తెలియదా?నన్నారు. ఇప్పుడు ప్రజలకు
నిస్వార్థంగా, నిజాయితీగా సేవలు అందిస్తున్న వలంటీర్లపై విషాన్ని కక్కడం వారి
పతనానికి సంకేతమన్నారు. కులం, మతం, పార్టీతో సంబంధం లేకుండా కేవలం అర్హులకు
ప్రభుత్వ పథకాలు అందించాలనే సంకల్పంతో వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారని,
వారంతా తొలిరోజు నుంచీ ఇప్పటికీ అదే నిబద్ధతతో పనిచేస్తున్నారని వివరించారు.
ఇకనైనా వాలంటీర్ల పై ఇష్టానుసారం మాట్లాడితే తాము కూడా రెండింతలు గట్టిగా
మాట్లాడాల్సి వస్తుందని ధర్మాన కృష్ణదాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.