అమరావతి : విదేశాల్లో విద్యార్థులకు అందిస్తున్న వివిధ కోర్సులను పరిశీలించి
వాటిని కూడా ఇక్కడ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకు రావాలని ఆంధ్ర ప్రదేశ్
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గురువారం ఉన్నత విద్యాశాఖపై క్యాంపు
కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా
సీఎం వై.యస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ డిగ్రీ చదువుతున్న వారి
నైపుణ్యాలను బాగా పెంచాలని, వివిధ కోర్సులను పాఠ్యప్రణాళికలో ఇంటిగ్రేట్
చేయాలన్నారు. జాబ్ ఓరియెంటెడ్ కరిక్యులమ్ ఉండాలని, సర్టిఫైడ్ ఆన్లైన్
వర్టికల్స్ కరిక్యులమ్‌లో భాగం కావాలని, ఈ తరహా కోర్సుల వలన డిగ్రీ
పూర్తయ్యేనాటికి స్వయం ఉపాధి అందుతుందన్నారు.
ఉన్నత విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని, ఈ
ఖాళీల భర్తీపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, కోర్టు కేసులను వీలైనంత త్వరగా
పరిష్కారం చేసుకుని జూన్‌కల్లా నియామక ప్రక్రియను ప్రారంభించేలా చూడాలన్నారు.
ఉన్నత విద్యాశాఖలో పెద్ద ఎత్తున సంస్కరణలు చేపడుతున్నామని, ఈ నేపధ్యంలో
సిబ్బంది భర్తీ కూడా త్వరితగతిన చేపట్టాలని ఆ మేరకు మరింత చురుగ్గా
పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉన్నత విద్యాశాఖ పరిధిలోని ప్రతి కాలేజీలో కూడా
బోధన పరంగా, వసతులు పరంగా నాణ్యత పెరగాలని, ప్రతి విద్యాసంస్థ కూడా నాక్
అక్రిడిటేషన్ సాధించాలని, మూడేళ్లలో కాలేజీల ప్రమాణాలు పెంచుకునేలా వారికి
చేయూత నివ్వాలన్నారు. ఒక్కో ఏడాది ఒక్కో లక్ష్యాన్ని అందుకుంటూ మూడేళ్లలో
ప్రమాణాలు పెంచుకోవాలని, మూడేళ్ల తర్వాత కచ్చితంగా ఉన్నత విద్యాశాఖలోని
విద్యాసంస్థలు నాక్ అక్రిడిటేషన్ సాధించాలని, అలా సాధించలేని పక్షంలో
సంబంధిత కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని,
అప్పుడే విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు.
కళాశాలల్లో కోర్సులన్నీ ఇవాల్టి అవసరాలకు తగిన విధంగా రూపొందించాలని,
కళాశాలలకు అనుమతుల విషయంలో కూడా యూనిఫామ్ పాలసీ ఉండాలని, వివిధ కోర్సులకు
సంబంధించిన కరిక్యులమ్ అందించే బాధ్యత స్కిల్ యూనివర్సిటీ తీసుకోవాలని
సూచించారు. నియోజక వర్గానికి ఒకటి చొప్పున 175 స్కిల్ సెంటర్లు ఏర్పాటు
చేస్తున్నామని, ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉన్న పరిశ్రమలకు అనుగుణంగా కోర్సులు
ఏర్పాటు చేయాలని, హై ఎండ్ స్కిల్స్‌లో భాగంగా సాప్ట్వేర్ స్కిల్స్‌ను కూడా అభివృద్ధి
చేయాలని, కోడింగ్, క్లౌడ్ సర్వీసెస్లాంటి డిమాండ్ ఉన్న కోర్సులపై దృష్టి
పెట్టాలని, విద్యార్ధులకు సర్టిఫికేషన్ ఉంటేనే ఎంప్లాయిమెంట్
పెరుగుతుందన్నారు. ఐటీ, స్కిల్ డెవలప్మెంట్ శాఖలు కలిపి కరిక్యులమ్
రూపొందించాలన్నారు. సోలార్ పార్క్‌లు, సోలార్ మోటార్లు, ప్యానెల్స్ రిపేరు
వంటి వాటిలో నైపుణ్యం కొరత చాలా ఎక్కువగా ఉంది. ప్రతి నియోజకవర్గంలో ఇవి
అందుబాటులో ఉండాలని, ఈ మేరకు కోర్సులు, కరిక్యులమ్, శిక్షణ ఉండాలని,
వచ్చే జూన్ లక్ష్యంగా ఈ తరహా కోర్సులు ఏర్పాటు చేయాలన్నారు. కొన్ని ప్రైవేటు
బీఈడీ కాలేజీల్లో బోధన, వసతులు తీసికట్టుగా ఉన్నాయని, మరికొన్ని కాలేజీలు
మోసపూరిత చర్యలకు దిగుతున్నాయని సమావేశంలో చర్చ జరిగింది.