అమరావతి : వ్యవసాయశాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష
చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి
మంత్రులు కాకాని గోవర్ధన్‌రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, సంబంధిత శాఖల
ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి, సేకరణపై
సీఎంకు అధికారులు వివరాలందించారు. 2014–19 మధ్య ఆహార ధాన్యాల సగటు ఉత్పత్తి
153.95 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉండింది. 2019–20 నుంచి 2022–23 ఖరీప్ వరకూ
సగటు ఆహారధాన్యాల ఉత్పత్తి 166.09 లక్షల మెట్రిక్ టన్నులు. రబీకి సంబంధించి
ఇ– క్రాప్ బుకింగ్ ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభిస్తామని వెల్లడించిన
అధికారులు. మార్చి మొదటి వారంలో తుది జాబితా వెల్లడిస్తామని వెల్లడి. రబీలో
కూడా రైతులకు విత్తనాల పరంగాగాని, ఎరువుల పరంగాగాని ఎలాంటి ఇబ్బంది రాకుండా
చూసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఆర్బీకేల ద్వారా రైతులకు ఎరువులు
అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. సీఎం
ఆదేశాల ప్రకారం ఆర్బీకేల స్థాయిలో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు, కిసాన్
డ్రోన్లు, రైతులకు 50శాతం సబ్సిడీతో వ్యక్తిగత వ్యవసాయ పరికరాల పంపిణీపై
ప్రత్యేక దృష్టిపెట్టినట్టు తెలిపిన అధికారులు. ఈ ఏడాది మార్చి, మే–జూన్
నెలల్లో ఈ కార్యక్రమాలను అమలు చేస్తామని అధికారులు తెలిపారు. రెండు వేల
డ్రోన్లను పంపిణీ చేసేదిశగా కార్యాచరణ చేశామన్న అధికారులు తొలివిడతగా రైతులకు
500 పంపిణీ చేస్తామని తెలిపారు. గత డిసెంబరు నుంచే డ్రోన్ల వినియోగంపై శిక్షణ
ప్రారంభించామని తెలిపిన అధికారులు శిక్షణ పొందినవారికి సర్టిఫికెట్లు
ఇస్తున్నామన్నారు. ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ యూనివర్శిటీ ద్వారా శిక్షణ
కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని అధికారులు వెల్లడించగా ఈ శిక్షణ
కార్యక్రమాలను మరింత ఉధృతం చేయాలని సీఎం జగన్ సూచించారు. అలాగే ఉత్తరాంధ్రలో
కూడా శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమీక్షకు వ్యవసాయం,
సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి,
పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు,
ఏపీ అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎం వి యస్ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ సలహాదారు ఐ
తిరుపాల్‌రెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ (ఎఫ్ఏసీ) వై మధుసూధన్‌రెడ్డి,
మార్కెటింగ్, సహకారం ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరి, పౌరసరఫరాలశాఖ కమిషనర్
హెచ్ అరుణ్‌కుమార్, ఏపీ స్టేట్ సివిల్ సఫ్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ వీసీ అండ్
ఎండీ జీ వీరపాండ్యన్, సివిల్ సఫ్లైస్ డైరెక్టర్ ఎం విజయ సునీత, వ్యవసాయశాఖ
కమిషనర్ సీహెచ్ హరికిరణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్ధ వీసీ
అండ్ ఎండీ జీ శేఖర్ బాబు, ఏపీ మార్క్‌ఫెడ్ ఎండీ రాహుల్ పాండే, ఆచార్య ఎన్ జీ
రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఎ విష్టువర్ధన్ రెడ్డి ఇతర
ఉన్నతాధికారులు హాజరయ్యారు.