విజయవాడ : విశాఖ మెట్రో రైలు ప్రాజక్టుకు రానున్న బడ్జెట్ లో నిధులు మంజూరు
చేయాలని రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి
అన్నారు. ట్విట్టర్ వేదికగా మంగళవారం పలు అంశాలు వెల్లడించారు. విశాఖపట్నం
సిటీతో పాటు సిటీకి ఆనుకొని ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలు కలిపి మొత్తం 41 లక్షల
మంది జనాభా జీవిస్తున్నారని తెలిపారు. పెరుగుతున్న జనాభా అవసరాలు దృష్టిలో
పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 76.9 కిలోమీటర్ల మేర మెట్రో రైలు
ప్రాజక్టు కొరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించిందని ఈ మేరకు 2017 మెట్రో
రైలు పాలసీ అనుసరించి డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రాజక్టు రిపోర్టు) సైతం
సమర్పించిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక రాజధాని అయిన
విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజక్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరుతున్నట్లు తెలిపారు.
ఎస్సీ సబ్ ప్లాన్ అమలులో దేశంలో ఏపీ టాప్ : ఎస్సీ సబ్ ప్లాన్ అమలులో దేశంలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని విజయసాయి రెడ్డి
పేర్కొన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ కింద దేశంలో 22 రాష్ట్రాల్లో మొత్తం 29.84
లక్షల మందికి లబ్ది చేకూరగా, ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి
ప్రభుత్వంలో 29.10 లక్షల మంది లబ్ధి పొందారని వివరించారు. ఈ విషయాన్ని కేంద్ర
గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ స్వయంగా వెల్లడించిందని అన్నారు.
డిజిటల్ బాటలో ప్రభుత్వ పాఠశాలలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6511 ప్రభుత్వ
పాఠశాలలు తొలివిడలతో డిజిటల్ విధానంలోకి మార్చినట్లు విజయసాయి రెడ్డి
తెలిపారు. ఈ మేరకు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇప్పటికే డిజిటల్ కంటెంట్
సిద్ధం చేసినట్లు తెలిపారు. సీబీఎస్ఈ బోధనకు వీలుగా ఈ-కంటెంట్ సిద్ధం
చేసినట్లు తెలిపారు. 13301 నాడు-నేడు స్కూల్లలో స్మార్ట్ టీవీలు, 30213
ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానళ్లతో పాఠాలు బోధన మొదలగు సాంకేతిక సదుపాయాలతో
విధ్యార్దులు చదువుల్లో మరింత మెరుగు పడతారని అన్నారు. పిల్లల్లో ఆరుబయట ఆటలు,
చలనశీలత ఆందోళన కలిగించే స్థాయిలో తగ్గిపోయినట్లు యునెస్కో నివేదికలో
వెల్లడించినట్లు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. 11 నుంచి 17 సంవత్సరాల మధ్య
వయసుగల పిల్లల్లో 81% మంది ఒక గంట కంటే తక్కువ సమయాన్ని అటలకు
కేటాయిస్తున్నారని అన్నారు. ఇది వారి శారీరక, మానసిక, సామాజిక ఎదుగుదల పై
తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు.