నగరి : రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధిష్ఠానం ఆదేశిస్తే, పవన్‌కల్యాణ్‌పై పోటీ
చేయడానికి తాను సిద్ధమని ఆంధ్ర ప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ
అన్నారు. సినిమాలు వేరు.. రాజకీయాలు వేరని సినీ నటుడు, ఏపీ ప్రభుత్వ సలహాదారు
అలీ అన్నారు. చిత్తూరు జిల్లా నగరిలో జరిగిన ముగ్గుల పోటీల బహుమతి
ప్రదానోత్సవం కార్యక్రమానికి అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన
మీడియాతో మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో వైసీపీ 175 సీట్లలో ఘన విజయం
సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘పవన్‌కల్యాణ్ నాకు మంచి మిత్రుడు.
అయితే, సినిమాలు, రాజకీయం రెండూ వేరు. పార్టీ ఆదేశిస్తే, పవన్‌పై
పోటీచేయడానికి సిద్ధం. ముఖ్యమంత్రి జగన్ ఆదేశం మేరకు ఎక్కడి నుంచైనా పోటీకి
నేను రెడీగా ఉన్నా. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని 175 సీట్లలో వైసీపీ
విజయం ఖాయం. రాష్ట్రానికి ఎవరు మంచి చేస్తున్నారు? ఎవరు మంచి పథకాలు
ఇస్తున్నారు? అనే విషయం ప్రజలకు బాగా తెలుసు. మంచి చేసే వారినే ప్రజలు
ఎన్నుకుంటారు. జగన్ మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. రాజకీయాల్లోకి
వచ్చాక విమర్శలు.. ప్రతి విమర్శలు సాధారణం. కొందరు విమర్శించిన సమయంలో తిరిగి
విమర్శించడం అవసరం. పవన్ కల్యాణ్ రోజాను డైమండ్ రాణి అని విమర్శించారు.
రోజమ్మ నిజంగానే కోహినూర్ డైమండ్‌తో సమానం’’ అని అలీ అన్నారు.