‘స్వయం’ వేదికగా ఆన్లైన్ కోర్సులు
రెగ్యులర్ కోర్సుల మాదిరిగానే క్రెడిట్ల కేటాయింపు
12 ప్రాంతీయ భాషల్లో యోగా పాఠ్యాంశాలు
ఆన్లైన్ పాఠ్యపుస్తకాలు సిద్ధం చేస్తున్న ఏఐసీటీఈ
ఈ విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి
విజయవాడ : ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్ తదితర కోర్సుల మంజూరు,
పర్యవేక్షణ, నియంత్రణ సంస్థ అయిన అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ)
తాజాగా భారతీయ ప్రాచీన విద్య అయిన యోగాపై కూడా దృష్టి సారించింది. ఇందులో
భాగంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో యోగాను ప్రోత్సహించే దిశగా చర్యలు
చేపట్టింది.కేంద్ర ప్రభుత్వ చర్యలతో యోగాకు అంతర్జాతీయంగా ఇప్పటికే ఎంతో
గుర్తింపు వచ్చిన నేపథ్యంలో దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేలా ఏఐసీటీఈ
అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రొఫెషనల్ కోర్సులకు శ్రీకారం చుట్టింది.
ఆన్లైన్ వేదికగా ఈ కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తెస్తోంది. కేంద్రం
ఏర్పాటు చేసిన ‘స్వయం’ పోర్టల్ ద్వారా ఈ ఆన్లైన్ కోర్సును ప్రవేశపెట్టింది.
ఈ కోర్సును అభ్యసించే వారికి క్రెడిట్లను కూడా అందించనుంది. వీటి ద్వారా
విద్యార్థులకు భవిష్యత్తులో అదనపు ప్రయోజనాలు చేకూరనున్నాయి.
ఈ అంశాల్లోనూ క్రెడిట్ కోర్సులు : యోగాతోపాటు విద్యార్థులకు ఉపయోగపడేలా మేధో
హక్కులు, బేసిక్ రిమోట్ సెన్సింగ్, భౌగోళిక సమాచార వ్యవస్థ, గ్లోబల్
నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ వంటి అంశాల్లో కూడా క్రెడిట్ కోర్సులను
ప్రారంభించింది. కేంద్ర ఆవిష్కరణల విద్యా విభాగం, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ
(ఇస్రో), వివేకానంద యోగా అనుసంధాన సంస్థలు ఈ కోర్సులకు రూపకల్పన చేశాయి.
యోగాను ప్రొఫెషనల్‌గా నిర్వహించే వారికి ఈ సర్టిఫికెట్ కోర్సుల వల్ల ఉద్యోగ,
ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.రిమోట్ సెన్సింగ్, భూ పరిశీలన సెన్సార్స్,
థర్మల్ రిమోట్ సెన్సింగ్, స్పెక్టరల్ సిగ్నేచర్స్, హైపర్ స్పెక్టరల్
రిమోట్ సెన్సింగ్ తదితర అంశాలపై విద్యార్థులకు ఈ కోర్సుల ద్వారా పరిజ్ఞానం
అలవడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఆ సర్టిఫికెట్ల ద్వారా
వారికి అదనపు ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన
పాఠ్యాంశాలను 12 ప్రాంతీయ భాషల్లోనూ ఏఐసీటీఈ అనువాదం చేయిస్తోంది. అంతేకాకుండా
ఆయా మాధ్యమాల్లోనూ ఈ కోర్సులను అందుబాటులోకి తెస్తోంది.
ఇప్పటికే తెలుగులో ఇంజనీరింగ్ పుస్తకాలు :కాగా 12 ప్రాంతీయ భాషల్లో
ఇంజనీరింగ్ కోర్సులను అందించేలా ఇప్పటికే ఆయా సంస్థలకు ఏఐసీటీఈ అనుమతులు
మంజూరు చేస్తోంది. ఆయా భాషలకు విద్యార్థుల డిమాండ్‌ను అనుసరించి.. ప్రాధాన్యత
క్రమంలో వీటిని అందుబాటులోకి తెస్తోంది. ఈ క్రమంలో 218 సబ్జెక్టుల్లోని
పాఠ్యాంశాల అనువాదాన్ని ఏఐసీటీఈ చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే తెలుగు,
కన్నడం, ఒడియా, గుజరాతీ, మరాఠీ తదితర భాషల్లో ఇంజనీరింగ్ పుస్తకాలను విడుదల
చేసింది. విద్యార్థులు తమ మాతృభాషల్లో ఆయా భావనలను అర్థం చేసుకుంటే వారు
వాటిని బాగా గుర్తుంచుకుని అన్వయించే అవకాశముంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇప్పటివరకు చాలామంది విద్యార్థులకు సమాధానం తెలిసినప్పటికీ ఇంగ్లిష్
పరిజ్ఞానం లేకపోవడం వల్ల పరీక్షలు రాయలేకపోయేవారని అంటున్నారు. ప్రాంతీయ భాషా
పాఠ్యపుస్తకాల వల్ల వారికి ఈ ఇబ్బంది తొలుగుతుందని అభిప్రాయపడుతున్నారు.