అమరావతి : దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా జీవ వైవిధ్య పరిరక్షణకు
ఆంధ్రప్రదేశ్ నడుం కట్టింది. గ్రామ స్థాయిలో జీవ వైవిధ్య యాజమాన్య కమిటీలు,
అక్కడి ప్రత్యేకతలతో జీవ వైవిధ్య రిజిస్టర్లు రూపొందించి జీవ వైవిధ్య
సంరక్షణకు పటిష్టమైన పునాదులు వేసింది. 2002లో జీవ వైవిధ్య చట్టం అమల్లోకి
వచ్చినా రాష్ట్రంలో దాని అమలుకు సంబంధించిన నియమ నిబంధనలకు మాత్రం 2009లో
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఆమోదం లభించింది. ఇప్పుడు
వైఎస్ జగన్ ప్రభుత్వంలో జీవ వైవిధ్య సంరక్షణకు ప్రాధాన్యత పెరిగి ఆ అంశంలో
దేశంలోనే అగ్రగామిగా ఎదిగింది.
సమగ్ర కార్యాచరణ అమలు : జీవ వైవిధ్య కమిటీలు పని చేసేందుకు 15 అంశాలతో సమగ్ర
కార్యాచరణ ప్రణాళికను తయారు చేశారు. గ్రామ వనాలు, మండల, జిల్లా స్థాయిలో జీవ
వైవిధ్య ఉద్యాన వనాలు ఏర్పాటు, అంతరించే జాతుల నర్సరీలను పెంచడం, మొక్కలు
నాటడం, చెరువులు, కుంటలను శుభ్రం చేయడం, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం,
సేంద్రియ, ప్రకృతి వ్యవసాయాన్ని పెంపొందించడం, స్కూళ్లు, కాలేజీలలో మొక్కలు
నాటడం, మహిళా సంఘాలు, యువతకు అవగాహన కార్యక్రమాలు, స్థానిక వైద్యులు, నాటు
వైద్యులను గుర్తించి వారి వద్ద ఉన్న జ్ఞానాన్ని గ్రంథస్తం చేయడం వంటి పనులను ఈ
కమిటీలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా అన్ని స్థానిక సంస్థల సర్పంచ్లు,
గ్రామ సచివాలయ కార్యదర్శులు, క్రియాశీలక సభ్యులతో జాయింట్ బ్యాంక్ ఖాతాలను
తెరిపించి వారికి మంజూరు చేసిన నిధులను బదిలీ చేశారు. ఇప్పటివరకు 10 వేల గ్రామ
పంచాయతీలకు రూ.75 వేల చొప్పున మొదటి విడతగా రూ.12 కోట్లను బదిలీ చేశారు.
జీవ వైవిధ్య సంరక్షణలో ఓ మైలురాయి
అన్ని స్థానిక సంస్థల్లోనూ 15 సంవత్సరాల నుంచి అసంపూర్తిగా ఉన్న జీవ వైవిధ్య
యాజమాన్యాల కమిటీలను అతి తక్కువ కాలంలో పూర్తి చేయడం జీవ వైవిధ్య సంరక్షణలో ఒక
మైలు రాయి. ఇది దేశం మొత్తంలో మన రాష్ట్రానికి ఒక ప్రత్యేకతను, ఒక విశిష్టమైన
గుర్తింపును తీసుకువచ్చింది. ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఏపీలో జీవవైవిధ్య
సంరక్షణకు సంస్థాగత నిర్మాణం జరిగింది.
– జీవ వైవిధ్య మండలి రిటైర్డ్ సభ్య కార్యదర్శి,
అటవీ శాఖ పూర్వ పీసీసీఎఫ్ దెందులూరి నళినీమోహన్