చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి.
రాయచోటి : రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నది మాజీ సీఎం
చంద్రబాబు నాయుడు, అతని అనుచరులేనని అన్నమయ్య జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు
రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. సోమవారం పీలేరు
పర్యటనలో కార్యకర్తల పరామర్శ పేరుతో చంద్రబాబు మాట్లాడిన తీరుపై ఎమ్మెల్యే
శ్రీకాంత్ రెడ్డి రాయచోటిలో తీవ్రంగా ఆక్షేపించారు. రాష్ట్రంలో తీవ్రవాదం
,ఫ్యాక్షనిజం, నక్సలిజం, రౌడీయిజాలను అణచివేసింది తానేనని చంద్రబాబు
చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో నక్సలిజం,
ఫ్యాక్షనిజం, తీవ్రవాదం రౌడీయిజం రాజ్యమేలిన విషయం ప్రజలు మర్చిపోలేదు
అన్నారు. నక్సలిజం కారణంగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఒక శాసనసభ్యులు,
మాజీ శాసనసభ్యులు హత్యకు గురైన విషయం గుర్తు చేసుకోవాలన్నారు. మీ పాలనలో
నక్సలిజం, రౌడియిజం కారణంగా ఎంతోమంది ప్రజా ప్రతినిధులు, అధికారులను పొట్టన
పెట్టుకోగా, మరి ఎందరో ఊర్లు వదిలి బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో
పెట్టుకొని తల దాచుకున్న విషయం మరిచారా అంటూ నిలదీశారు. అంతకంటే దారుణంగా
మీకున్న అధికారాన్ని అడ్డుపెట్టుకొని కుటిల రాజకీయ పన్నాగంతో వంగవీటి రంగాను
హత్య చేయించినది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడన్న పింగళి దశరథ
రామయ్యను ఆటోలో వెళుతుండగా నడిరోడ్డుపై హత్య చేయించిన సంఘటనలను కూడా రాష్ట్ర
ప్రజలు నేటికీ మర్చిపోలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో శాంతిభద్రతలు
అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితుల్లో దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వాటిని కూకటివేళ్లతో పెకిలించి ప్రజా
పాలన అంటే ఏంటో చూపించారన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కూడా..
చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక, వాళ్ళ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏమి చేసినా
చూసి చూడనట్లు వెళ్లాలంటూ జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు ఆదేశించిన విషయం
మరిచావా బాబు అంటూ ఆయన నిలదీశారు. నేడు జగన్ మోహన్ రెడ్డి గారు… రాష్ట్రంలో
రౌడీముకలు, గుండాలపై కఠిన చర్యలు చేపడితే మీ పార్టీ కార్యకర్తలు, నాయకులపై
దాడులు చేస్తున్నారంటూ ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజలను భయపెట్టే ప్రయత్నం బాబు
చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. నాడు గుంటూరు పట్టణంలోని మైనార్టీల పైన
దేశ ద్రోహం కేసు నమోదు చేయించి వారిని చిత్రహింసలకు గురి చేసిన విషయం ఈ
రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదన్నారు. రాయచోటి పట్టణంలో కూడా అమాయకులైన
మైనార్టీలపై కేసులు నమోదు చేయించిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. జగన్మోహన్
రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయచోటి మైనార్టీలపై నమోదైన తప్పుడు కేసులను
చట్ట ప్రకారం తొలగించే ప్రయత్నం చేస్తే కోర్టుకు వెళ్లి వాటిపై స్టే తెచ్చినది
మీరు కాదా అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.