విజయవాడ : దృఢమైన, నిలకడైన, జవాబుదారీ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్
రెడ్డి సారధ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అందిస్తుంటే అస్తవ్యస్తమైన
పొత్తులతో ముఖ్యమంత్రి పదవి కోసం ప్రతిపక్షం కుర్చీలాట ఆడుతోందని రాజ్యసభ
సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
ట్విట్టర్ వేదికగా శనివారం ఆయన పలు అంశాలపై స్పందించారు. అస్థిరత, మితిమీరిన
ప్రతిపక్ష పార్టీ అవినీతి రాష్ట్ర అభివృద్దిపై ప్రభావం చూపుతోందని అన్నారు.
రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ విజయసాయి రెడ్డి
సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రాంతి పండుగ ప్రజలందరి జీవితాల్లో
వెలుగులు నింపాలని, చక్కెర పొంగలి లాంటి తియ్యదనంతో జీవితాలు ఆనందమయం కావాలని
అన్నారు. దేవుడి దయతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని
కోరుకుంటున్నానని అన్నారు. భారత సంతతికి చెందిన ఉషా రెడ్డి యుఎస్ఏ సెనేటర్ గా
ఎన్నిక కావడంపై ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. లభించిన పదవితో
ప్రజలకు ఆమె మరింత సేవ చేయాలని కోరుకుంటున్నానని అన్నారు. భారతదేశం శీఘ్రంగా
అభివృద్ధి చెందుతున్న కారణంగా దక్షిణ ఆసియా అభివృద్ధి రేటు 2023లో 5.5శాతం
ఉంటుందని ప్రపంచ ఎకనామిక్ ప్రోస్పెక్ట్స్ లో ప్రపంచ బ్యాంకు వెల్లడించినట్లు
విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఇది 2024లో 5.8 శాతానికి పెరుగుతుందని అంచనా
వేసినట్లు తెలిపారు. భారతదేశాన్ని మినహాయిస్తే దక్షిణ ఆసియా అభివృద్ధి రేటు
2023లో కేవలం 3.6శాతం మాత్రమే ఉంటుందని అన్నారు. ప్రపంచంలో యూరప్, ఉత్తర
అమెరికా, దక్షిణ అమెరికా ఖండాల్లోని పెద్ద పెద్ద దేశాలు ఆర్థిక మాంద్యంతో
కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, భారతదేశం అభివృద్ధి రేటు అనేక దేశాల కంటే వేగంగా
ఉందని ప్రపంచ బ్యాంకు నివేదిక ద్వారా స్పష్టమవుతోందని విజయసాయి రెడ్డి
అన్నారు. అంతేకాక, దక్షిణ ఆసియా అభివృద్ధిలో భారతదేశం కీలకం కానుందని, దేశ
ఆర్థిక విధానాలు అత్యంత ప్రభావవంతమైనవని ఆయన అన్నారు.