విజయవాడ : తెలుగు వారి అతి పెద్ద పండుగ సంక్రాంతి ప్రజలందరి జీవితాల్లో కొత్త
వెలుగులు నింపాలని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే
మల్లాది విష్ణు ఆకాంక్షించారు. మూడు రోజులపాటు జరిగే సంక్రాంతి ఉత్సవాలలో
భాగంగా నియోజకవర్గంలో శనివారం తెల్లవారుజాము నుంచి ప్రజలు భోగి మంటలను వేశారు.
23వ డివిజన్ బీసెంట్ రోడ్డులో భోగి వేడుకలను వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి
ఆత్మకూరు సుబ్బారావు, డివిజన్ కోఆర్డినేటర్ ఒగ్గు విక్కీలతో కలిసి మల్లాది
విష్ణు ప్రారంభించారు. యువత, మహిళలు కేరింతలు కొడుతూ సందడి చేశారు. తమ
కష్టాలు, బాధల్ని అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ సుఖసంతోషాలు ప్రసాదించాలని భోగి
మంటల చుట్టూ తిరుగుతూ తమ ఆనందాల్ని పంచుకున్నారు. ఏటా బీసెంట్ రోడ్డులో భోగి
వేడుకలను నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు
తెలిపారు. ఈ వేడుకలతో నగరానికి పల్లె కళ వచ్చిందన్నారు. తెలుగు వారి సంస్కృతి
సంప్రదాయాలకు ‘సంక్రాంతి’ ప్రతీక అని మల్లాది విష్ణు అన్నారు. కష్టించి
పండించిన పంట సిరి చేతికొచ్చిన ఆనందంలో కళ్ళల్లో విరిసే కోటి కాంతులతో
రైతన్నలు ఈ పండుగను జరుపుకుంటారని తెలిపారు. కనుమ నాడు వ్యవసాయ నేస్తాలైన
పశువులను పూజిస్తారన్నారు. అటువంటి అన్నదాతల విషయంలో దివంగత మహానేత వైఎస్
రాజశేఖర్ రెడ్డి కన్న కలలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాకారం చేస్తున్నారని
మల్లాది విష్ణు చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ముందు జాగ్రత్త చర్యలతో
సాగునీటి ప్రాజెక్టులన్ని జలకళను సంతరించుకున్నట్లు వెల్లడించారు. వైఎస్సార్
రైతు భరోసా, ఉచిత పంటల బీమా పథకం, రాయితీ విత్తనాలు, పురుగుమందులు,
యాంత్రీకీకరణ పరికరాలు వంటి సంక్షేమ పథకాలతో జగనన్న ప్రభుత్వం రైతులకు
అన్ని విధాలా అండగా నిలుస్తోందని ఉద్ఘాటించారు. కార్యక్రమంలో నాయకులు వెన్నం
రత్నారావు, చినబాబు, చల్లా సుధాకర్, అంజిబాబు, బెజ్జం రవి, తోపుల వరలక్ష్మి,
ఝాన్సీరాణి, పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.