చిత్తూరు : నారావారిపల్లెలో నాలుగు సంవత్సరాల తర్వాత నారా, నందమూరి కుటుంబసభ్యులు తమ స్వగ్రామం నారావారిపల్లెకి సంక్రాంతి పండుగకు వచ్చి సందడి చేశారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, హీరో బాలకృష్ణ రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో భోగి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారు జామునే లేచి ఇళ్ల ముందు, వీధుల్లో పెద్ద ఎత్తున భోగి మంటలు వెలిగించి పాత వస్తువులను అందులో వేశారు. కీడు తొలగిపోవాలని కోరుకున్నారు. మంటల చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో సందడి చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో నారా, నందమూరి కుటుంబసభ్యులు తమ స్వగ్రామం నారావారిపల్లెకి సంక్రాంతి పండుగకు వచ్చి సందడి చేశారు. చంద్రబాబు నాయుడు ఇంటి ముందు భోగి వేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలతో ముచ్చటించారు. ఈ సందర్బంగా మాట్లాడిన చంద్రబాబు జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
సినిమాల పండుగ : నారావారిపల్లెలోబాలకృష్ణ సందడి చేశారు. ఉదయం ఉదయపు నడక అనంతరం చంద్రబాబు నాయుడు ఇంటి ముందు వేసిన భోగి మంటలలో చలి కాచుకుని అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వీర సింహారెడ్డి సినిమా అన్ని రకాల ప్రేక్షకులు చూడదగ్గదని.. సంక్రాంతి పండుగ అంటేనే సినిమాల పండుగ అని ఆయన అన్నారు. నా ప్రేక్షక దేవుళ్ళు, ఆత్మీయులు, అభిమానులు ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రాష్ట్రం బాగుపడాలని మంచి నాయకత్వం రావాలని ఆయన ఆకాంక్షించారు.