మచిలీపట్నం : మచిలీపట్నం పోర్టుకు కేంద్రం నుంచి పర్యావరణ అనుమతి లభించడం
జిల్లా వాసులకు నిజమైన సంక్రాంతి పండుగ వాతావరణం ముందుగానే ప్రారంభమైందని, ఇది
ఒక గొప్ప శుభ సూచకం అని మాజీ మంత్రివర్యులు, కృష్ణాజిల్లా వైయస్సార్ కాంగ్రెస్
పార్టీ అధ్యక్షులు, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య ( నాని )
హర్షం వ్యక్తం చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ, నేడు ఢిల్లీలో జరిగిన
నిపుణుల అంచనా కమిటీ సమావేశంలో మచిలీపట్నం పోర్టుకు సంబంధించిన అన్ని పర్యావరణ
అనుమతులు లభించినట్లు ఎమ్మెల్యే పేర్ని నాని తెలిపారు. నిర్మాణ పనులు మొదలైన
30 నెలల్లోనే బందరు పోర్టు సిద్ధం చేస్తామని మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని
నాని తెలిపారు. ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలో ముఖ్యమంత్రి వైఎస్
జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా పోర్టు పనుల ప్రారంభానికి శంకుస్థాపన
జరుగుతుందని అన్నారు.
విజయవాడ – మచిలీపట్నం ప్రధాన రహదారిని 6 లైన్ల రహదారిగా ఆధునీకరణ ప్రభుత్వం
చేయనుందని ఆయన తెలిపారు. బందరు పోర్టు నిర్మాణానికి 5,253.88 కోట్ల రూపాయలు
అవసరం అవుతాయని అంచనా వేస్తున్నట్లు, ఇందులో 75 శాతం బ్యాంకు రుణం, 25 శాతం
ప్రభుత్వం సొంతంగా ఖర్చు చేస్తోందన్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 75 శాతం
రుణం ఆమోదించిందని చెప్పారు. సముద్ర కెరటాలను అడ్డుకోవడానికి ఓ వైపు 2
కిలోమీటర్ల 325 మీటర్ల దక్షిణం, ఉత్తరం బ్రేక్స్ వాటర్ గోడల నిర్మాణాలకు
రూ.446 కోట్లు అవసరం అవుతాయన్నారు. ఉత్తరం వైపున 250 మీటర్ల కొండరాళ్లతో
కాంక్రీట్ గోడ నిర్మాణానికి రూ. 10. 94 కోట్లు, అలాగే దక్షిణం వైపున సడన్
బ్రేక్ వాటర్ రూ. 435 కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నట్లు తెలిపారు. 4. 6
కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వాల్సి వస్తుందన్నారు. డ్రెడ్జింగ్ కోసం మరో
రూ.1242.88 కోట్లు, సముద్రం నుంచి ఓడలు రావడానికి అప్రోచ్ ఛానెల్ నిర్మాణానికి
రూ. 706.26 కోట్లు, బ్రేక్ వాటర్ మధ్యలో ఓడలు తిరగడానికి టర్నింగ్ సర్కిల్,
బెర్త్ పాకెట్స్ కోసం రూ.452.07 కోట్లు కావాలని ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు.