అమరావతి సచివాలయం : ప్రభుత్వ ఉద్యోగులకు సంతృప్తికర స్థాయిలో ఆరోగ్య పథకం
అమలుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి
ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం
వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖలపై
సమీక్షా సమావేశాన్ని సిఎస్ నిర్వహించారు. ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ
ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలులో పలు సమస్యలు ఉన్నాయని, వాటిని తక్షణమే
పరిష్కరించాలని పలు ఉద్యోగ సంఘాల నాయకులు తమను కలిసి రిప్రజంటేషన్ లు ఇచ్చారని
తెలిపారు. ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై ఉద్యోగుల ఆరోగ్య పథకం అమల్లోని
సమస్యలన్నింటినీ సాద్యమైనంత మేర పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర
వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబును
ఆదేశించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ
నూతన వెబ్ సైట్, మొబైల్ యాప్ లను రూపొందించే పనులను, రాష్ట్ర వ్యాప్తంగా, ఇతర
రాష్ట్రాల్లో కియోస్క్‌లు స్థాపన పనులన్నింటినీ ఈ నెల 26 కల్లా పూర్తిచేసి
సిద్దంగా ఉంచాలని డా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు సిఇవోను ఆయన
ఆదేశించారు. ప్రగతిలోనున్న పలు వైద్య కళాశాలల నిర్మాణ పనులను ఆయన సమీక్షిస్తూ
ప్రాధాన్యతా క్రమంలో కనీసం విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాల
వైద్య కళాశాలల నిర్మాణ పనులను ఈ మార్చి మాసాంతానికల్లా పూర్తిచేయాలని
ఏ.పి.ఎం.ఎస్.ఐ.డి.సి. మేనేజింగ్ డైరెక్టర్ డి.మురళీధర్ రెడ్డిని ఆదేశించారు.
ఆయా వైద్య కళాశాలల నిర్మాణ పనులకు ప్రభుత్వ పరంగా విడుదల చేయాల్సిన నిధుల
విషయంలో ఏమాత్రం జాప్యం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ కార్యదర్శి
సత్యనారాయణకు ఆయన సూచించారు. వైద్య కళాశాల నిర్మాణ పనులకు అవసరమైన నిధులను
వచ్చే ఏడాది బడ్జెట్ లో కూడా తగిన కేటాయింపులు జరిగేలా చూడాలని ఆర్థిక శాఖ
అధికారులను ఆదేశించారు. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్ హెచ్ ఎం) నిధులను క్లైయిమ్
చేసేందుకు, పెండింగ్ లోనున్న పలు బిల్లులను క్లియర్ చేసేందుకు అవసరమైన
నిధులను మంజూరు చేయాలని ఆర్థిక శాఖ అధికారులను సి.ఎస్.ఆదేశించారు.
డైరెక్టర్ ఆఫ్ హెల్త్, ఏ.పి.వి.వి.పి., డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్
పరిధిల్లో అందజేసే ఆరోగ్య సేవలు,ఆసుపత్రుల నిర్వహణలను సీఎస్ సమీక్షిస్తూ ఈ
మూడు విభాగాల పరిధిల్లో సారూప్యం ఉన్న బడ్జెట్ హెడ్లను అన్నింటినీ విలీనం
చేసి నిధుల మంజూరీలో ఎంతో స్పష్టత, పారదర్శకత ఉండేలా చూడాలని ఆర్థిక శాఖ
ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణను సీఎస్ ఆదేశించారు.
వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు,
ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్, ఎ.పి.ఎం.ఎస్.ఐ.డి.సి.
మేనేజింగ్ డైరెక్టర్ డి.మురళీధర్ రెడ్డి, డా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్
కేర్ ట్రస్టు సి.ఇ.ఓ. హరీంధిర ప్రసాద్, ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ
తదితరులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.