విజయవాడ : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు, ప్రత్యేకించి రాష్ట్ర
ప్రజానీకానికి ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ సంక్రాంతి
శుభాకాంక్షలు తెలియ జేశారు. భోగి మంటలు, రంగ వల్లులు, హరి దాసుల కీర్తనలు,
గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్ళు, ధాన్యపు సిరులు గ్రామ సీమలకు సంక్రాంతి
శోభను తీసుకువచ్చాయని గవర్నర్ పేర్కొన్నారు. సంక్రాంతి మన సంస్కృతీ,
సంప్రదాయాలను ప్రతిబింబించే అచ్చ తెలుగు పండుగ అన్నారు. పండుగ శుభవేళ తెలుగు
లోగిళ్ళలో ఆనంద సిరులు వెల్లివిరియాలన్నారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పర్వ
దినాలను ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకోవాలని. ఈ పండుగ సంబరాలు రాష్ట్రంలోని
ప్రతి ఒక్కరి జీవితాల్లో పురోగతిని తీసుకురావాలని గవర్నర్ హరిచందన్
ఆకాంక్షించారు.