మచిలీపట్నం : రాష్ట్ర ప్రజలంతా ‘భోగి’ భోగభాగ్యాలతో ‘సంక్రాంతి’ సంపదలతో
‘కనుమ’ కనువిందుగా జరుపుకోవాలని తాను మనస్ఫూర్తిగా కోరుకొంటున్నట్లు మాజీ
మంత్రి, కృష్ణాజిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మచిలీపట్నం
శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య ( నాని ) సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు
తెలిపారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత
గ్రామాల మీద మమకారానికి, రైతులకు ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి అని
అన్నారు. సంక్రాంతి పండుగ సంబరాలతో తెలుగులోగిళ్లు శుభాలకు, సుఖసంతోషాలకు
నెలవు కావాలని, రైతుల ఇంట ఆనందాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నానన్నారు.
తెలుగు వారి అతి ముఖ్యమైన పండుగలలో మకర సంక్రాంతి ఒకటని ఎమ్మెల్యే పేర్ని
నాని అన్నారు. సంక్రాంతి వచ్చిందంటే చాలు, ఊరు కొత్త సందడిని
సంతరించుకుంటుందన్నారు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు మళ్ళీ తమ స్వంత ప్రాంతాలకు
చేరుకుంటారన్నారు. ఇంటికి చేరిన ధాన్యపు సిరులు, ఇంటి ముందు రంగవల్లులు, వాటి
మధ్యలో గోబ్బెమ్మలు, హరిదాసుల ఆలాపనలు, ముంగిట నిలిచిన బసవన్నలు, పిండి వంటలు,
గాలి పటాలు, చిన్న పిల్లల కేరింతలు, కొత్త అల్లుళ్ళ కొంటెతనాలు, పందేల రాయుళ్ళ
ఆర్భాటాలతో సంక్రాంతో శోభ వెల్లివిరుస్తుందన్నారు. భోగి – సంక్రాంతి – కనుమ
మూడు పర్వ దినాలు అందించే జ్ఞాపకాలు అనుభూతులు సంవత్సరానికి సరిపడా
మిగులుతాయన్నారు. ప్రజలు అందరూ సంతోషంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని
ఎమ్మెల్యే పేర్ని నాని కోరారు.