సర్వీసులు, టూరిజం అండ్ కల్చరల్ ఆర్కియాలజీ శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని
ఏపీ జెఏసి అమరావతి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, వై వి రావు
సత్కరించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రోహిబిషన్
అండ్ ఎక్సైజ్, స్పోర్ట్స్ యువజన సర్వీసులు, టూరిజం అండ్ కల్చరల్, ఆర్కియాలజీ
శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్, బొప్పరాజు అనేక సంవత్సరాలు ఉద్యోగ, ఉపాధ్యాయ,
కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం సంఘాలలో కలసి పనిచేసిన నేపథ్యంలో
మంత్రి ని బొప్పరాజు శుక్రవారం రెవెన్యూ భవన్ కు ఆహ్వానించగా విశాల హృదయంతో
అంగీకరించి అమ్మవారి దర్శనానంతరం రెవెన్యూ భవన్ కు రాగా వారికి ఏపీ జెఏసి
అమరావతి పక్షాన ఘన స్వాగతం పలికారు.తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ రెవెన్యూ భవన్ కు విచ్చేసి
కీర్తిశేషులు తోట సుధాకర ప్రసాద్ కాంస్య విగ్రహం వద్ద నివాళులు అర్పించి వారి
నాయకత్వ పటిమ గురించి మాట్లాడారు. అనంతరం రెవెన్యూ భవన్ సమావేశ మందిరంలో
మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని వివిధ శాఖాపరమైన ఉద్యోగ సంఘాల నాయకులు ఘనంగా
సత్కరించారు. బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఉద్యోగ సంఘాలలో పనిచేసేటప్పుడు ఉద్యోగులకు ఏ చిన్న అవమానం జరిగినా వారి సమస్యల
పరిష్కారం విషయంలో అధికారులు అలసత్వం వహించినా ఉద్యోగ సంఘాల పక్షాన నిలబడి
గట్టిగా మాట్లాడే వారని, నిత్యం ఉద్యోగులకు ఏదో రకంగా మేలు జరగాలని కోరుకునే
వారని, ఎంతో కష్టపడి ఈ రోజు ఉన్నత స్థాయికి చేరుకుని, నేడు ప్రజలకు సేవ చేసే
గొప్ప స్థాయిలో ఉన్నారని, భవిష్యత్ లో వారు ఇంకా పెద్ద స్థాయికి ఎదగాలని ఆ
భగవంతునీ కోరుకుంటున్నామని తెలిపారు. అలాగే పిలవగానే, గత సంబంధాలను
మర్చిపోకుండా ఎంతో ఆప్యాయంగా, ప్రేమతో మా రెవెన్యూ భవన్ కి వచ్చి, అనేక
శాఖాపరమైన సంఘాల నాయకులను పేరు పేరునా పలుకరించరని, ఇదే ప్రేమను ఆప్యాయతను
భవిష్యత్ లో కూడా కొనసాగించాలని మంత్రిని కోరారు.
ఈ సందర్భంగా తెలంగాణా రాష్ట్ర మంత్రి శ్రీనివాస గౌడ్ మాట్లాడుతూ
ఉద్యోగులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియచేశారు. కనకదుర్గ అమ్మవారి
దర్శనానికి వచ్చిన సందర్భంగా మా చిరకాల మిత్రుడు వుమ్మడి రాష్ట్రంలో ఉద్యోగ
సంఘాల నాయకుడు బొప్పరాజుని కలవాలని వచ్చానని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో
బొప్పరాజు, మేము కలసి కొన్ని దశాబ్దాలు ఉద్యోగ సమస్యలపై కలసి పనిచేశామని, కానీ
తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్ర విభజన ఉద్యమాలు జరగటం, దరిమిలా ప్రత్యేక
రాష్ట్రం ఏర్పడటం జరిగిందని అప్పటికి వరకు కలసి పని చేసిన మేము భౌగోళికంగా
విడిపోయినప్పటికీ ఇప్పటికీ మా మనసులు కలిసే ఉన్నాయని తెలిపారు.