తిరుపతి : సంక్రాంతి పండగను కుటుంబసభ్యులతో స్వగ్రామంలో చేసుకునేందుకు టీడీపీ
అధినేత చంద్రబాబు తిరుపతి జిల్లా నారావారిపల్లెకు చేరుకున్నారు. గురువారం
రాత్రి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌నుంచి రేణిగుంట విమానాశ్రయానికి
చేరుకున్నారు. ఆయనకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
అక్కడినుంచి తిరుపతి గ్రామీణ మండలం తుమ్మలగుంట వద్దకు చేరుకున్నారు.
చంద్రబాబుకు మహిళలు హారతి పట్టి పూలవర్షం కురిపించారు. మార్గమధ్యంలో నాయకులు
భాస్కర్‌రెడ్డి, శ్రీధర్‌నాయుడు, ఈశ్వర్‌రెడ్డి ఇళ్లకు వెళ్లారు. అక్కడినుంచి
నేరుగా నారావారిపల్లెలోని తన ఇంటికి వెళ్లారు. చంద్రబాబుతోపాటు లోకేశ్
గురువారం రాత్రి నారావారిపల్లెకు వచ్చారు. గురువారం మధ్యాహ్నమే చంద్రబాబు
సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, మనువడు దేవాన్ష్ నారావారిపల్లెకు
చేరుకున్నారు. చంద్రబాబు వెంట పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి
అమరనాథ్‌రెడ్డి, చిత్తూరు పార్లమెంటరీ పార్టీ టీడీపీ అధ్యక్షుడు పులివర్తి
నాని, మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్‌వర్మ, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తిరుపతి
పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు నరసింహయాదవ్ తదితరులు ఉన్నారు.
కుప్పంనుంచి నారా లోకేశ్ పాదయాత్ర చేయనున్నందున రేణిగుంట విమానాశ్రయానికి
వచ్చిన ఆయనకు తెలుగు యువత నేతలు యువగళం పోస్టర్లతో వినూత్న స్వాగతం పలికారు.