విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత రాజ్యాంగ నిర్మాత డా. బీ.ఆర్. అంబేడ్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహం పనులను ఏప్రిల్ 14 కల్లా పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. విజయవాడ స్వరాజ్ మైదానం (పీడబ్యూడీ గ్రౌండ్)లో శరవేగంగా జగరుతున్న విగ్రహ ప్రాజెక్టు పనులను గురువారం మంత్రులు పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ విజయవాడలో అత్యంత ప్రాముఖ్యత, ప్రాధాన్యత కలిగిన ఎంతో ఖరీదైన ప్రాంతంలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా డా. బీ.ఆర్. అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం అదృష్టమన్నారు. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.300 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని, ఇప్పటికే 248 కోట్లు వెచ్చించామని తెలిపారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇలాంటి సాహసం చేయలేదన్నారు. గురువారం అంబేడ్కర్ విగ్రహం బూట్లు వచ్చాయని, మిగతా భాగాలు ట్రావెల్ అవుతున్నాయని క్రమంగా వస్తున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఎంతఖర్చైనా చెప్పిన సమయానికి పూర్తిచేస్తున్నామని, అందరూ సహకరించాలని మంత్రి మేరుగు నాగార్జున కోరారు.