శ్రీకాకుళం : యువత బలమైన పోరాటాలు చేస్తేనే రాజకీయ వ్యవస్థలో మార్పు వస్తుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మన భవిష్యత్తు కోసం..మన ప్రాంత భవిష్యత్తు కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. నిరాశలో కూరుకుపోయిన ఉత్తరాంధ్ర యువతలో భరోసా నింపడానికే యువశక్తి కార్యక్రమాన్ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారన్నారు. సంక్షేమం అంటే కేవలం బటన్ నొక్కడమే అని భావిస్తోన్న నియంత ముఖ్యమంత్రికి మనమంతా కలిసి బుద్ధి చెప్పాలని అన్నారు. గురువారం సాయంత్రం
శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి సభ వేదికపై నుంచి ఆయన ప్రసంగించారు.
నాదెండ్ల మనోహర్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ “ కొంతమంది వ్యక్తులు, కొన్ని ప్రాంతాల కోసం జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ స్థాపించలేదు. భావి తరాలకు మంచి భవిష్యత్తు అందించాలనే సంకల్పంతో పార్టీని ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు షేర్ చేసినందుకు యువకులపై దాడులు చేసి, కేసులు పెట్టి ఈ ప్రభుత్వం భయ భ్రాంతులకు గురి చేస్తోంది. యువత మంచి నాయకత్వాన్ని కోరుకుంటుంది. పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి ముఖ్యమంత్రి గారూ…జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దూషణలకు మాత్రమే మంత్రులు, ముఖ్యమంత్రి సమయం కేటాయిస్తున్నారు తప్ప ప్రజా సమస్యలు తీర్చడానికి ఇష్టపడటం లేదు.