గుంటూరు : విశాఖపట్నంలో త్వరలో జరగనున్న జీ-20 వర్కింగ్ గ్రూపు సన్నాహక సమావేశం, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్-2023 ఏర్పాట్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష
నిర్వహించారు. మార్చి 3–4 తేదీల్లో విశాఖలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ఏర్పాట్లపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడప్ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. 2014–2019 మధ్య రూ. 18.87 లక్షల కోట్లకు ఎంఓయూలు చేసుకుంటే వాస్తవానికి ఆ మధ్యకాలంలో గ్రౌండ్ అయిన పెట్టుబడుల్లో ఏడాదికి సగటున రూ.11,994 కోట్లు పెట్టుబడులు వచ్చాయని అధికారులు వివరించారు. 2019–2022 మధ్య గ్రౌండ్ అయిన పెట్టుబడుల్లో సగటున ఏడాదికి పెట్టుబడులు రూ. 15,693 కోట్లు వచ్చాయని, 2019 నుంచి ఇప్పటివరకూ ఎస్ఐపీబీ ఆమోదించిన ప్రతిపాదనలు రూ.1,81,821 కోట్లు కాగా ఈ పెట్టుబడులన్నీ వేర్వేరు దశల్లో పురోగతిలో ఉన్నాయని, వీటి ద్వారా 1,40,903 మందికి ఉద్యోగ కల్పన జరుగుతోందని అధికారులు పేర్కొన్నారు. వాస్తవిక పెట్టుబడులు లక్ష్యంగా సదస్సు ముందుకు సాగాలని, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను సమగ్రంగా వివరించేలా కార్యక్రమం రూపొందించాలని సీఎం. సూచించారు.
విశాఖపట్నంలో జి–20 సన్నాహక సదస్సు ఏర్పాట్లపై సీఎం సమీక్ష
ప్రపంచదేశాల నుంచి 250 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. ఒక్కొక్క జీ–20 సభ్యదేశం నుంచి 6గురు చొప్పున హాజరవుతారు. అంతర్జాతీయ సంస్థల నుంచి నలుగురు చొప్పున, కేంద్ర ప్రభుత్వం నుంచి మరో 100 మంది ప్రతినిధులు హాజరవుతారు. మార్చి 28–29 మధ్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూపు సమావేశం జరుగుతుంది. సమావేశం కోసం విశాఖపట్నం నగరాన్ని అందంగా తీర్చిదిద్దాలని, అవసరమైన రోడ్లు, సుందరీకరణ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని, ప్రధాన జంక్షన్లు, బీచ్ రోడ్డులో సుందరీకరణ పనులు చేపట్టాలని, ఈ సమావేశం సందర్భంగానే కాదు, అన్ని రోజుల్లోనూ ఇవి ఇలాగే ఉండేలా తగిన కార్యాచరణ చేయాలని సీఎం ఆదేశించారు.