కడప: సీజీడీ రంగంలో అగ్రగామి సంస్ధల్లో ఒకటైన ఏజీ అండ్ పీ ప్రథమ్ కంపెనీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి లిక్విఫైడ్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (ఎల్సీఎన్జీ) స్టేషన్ను కడపలో ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా పేర్కొన్నారు. కడప నగర శివార్లలో రాష్ట్రంలోనే మొట్టమొదటగా ఏర్పాటు చేసిన నూతన లిక్విఫైడ్ & కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (ఎల్సీఎన్జీ) స్టేషన్ను గురువారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, కడప పార్లమెంటరీ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి, ఏజీ, పీ ప్రథమ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అభిలేష్ గుప్తా లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా మాట్లాడుతూ సంప్రదాయం ఇంధన వనరుల లాంటి పెట్రోల్ డీజల్తో పోలిస్తే సి.ఎన్.జి.
లో అధిక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఈ సహజ వాయువు వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రంలో పర్యావరణ హితమైన వాతావరణాన్ని సృష్టించడం జరుగుతుందన్నారు. ఈ సహజ వాయువు వినియోగం కారణంగా వాహనాలు, పరిశ్రమలు విడుదల చేసే గాలి కాలుష్య కారకాలైన విషపూరిత రసాయనాలను అరికట్టడం సాధ్యమవుతుందని, అంతేకాకుండా దేశానికి అవసరమైన ఇంధన నిల్వలను సమృద్ధి చేసుకోగలమని తద్వారా దేశ
ఆర్థిక ప్రగతి పురోగమనం వైపు నడిచేందుకు తోడ్పడుతుందన్నారు. రాష్ట్రంలో సి.ఎన్. జి., పరిశ్రమలు, వాణిజ్య, గృహ విభాగాల కోసం సహజవాయువు అందించేందుకు చేపట్టిన కార్యక్రమాలను వేగ వంతం చేసేందుకు ఎజి&పి లాంటి సంస్థలు తగిన ప్రోత్సాహం అందిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీ, పీ ప్రథమ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శ్రీ అభిలేష్ గుప్తా, ఏజీ & పీ ప్రథమ్ సీనియర్ మేనేజ్మెంట్, ఉద్యోగులు పాల్గొన్నారు.