విజయవాడ : వివేనానందుడు భారతీయ సంస్కృతి, హిందూ మతం యొక్క వైవిధ్యమైన వారసత్వాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసారని సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు చదలవాడ నాగరాణి అన్నారు. నిస్వార్థ ప్రేమ, దేశం పట్ల అంకిత భావం కలిగి ఉండాలన్న ఆయన భోధనలను నేటి యువత ఆచరించాలన్నారు. సాంకేతిక విధ్యా శాఖ కమీషనర్ కార్యాలయంలో గురువారం స్వామి వివేకానంద 161వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హజరైన నాగరాణి మాట్లాడుతూ స్వామి బోధనలు మనలోని ఆత్మ శక్తిని గ్రహించేలా చేశాయన్నారు. వివేకానందుడిని ప్రపంచ ఆధ్యాత్మిక నాయకులలో ఒకరిగా గౌరవించుకుంటూ జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. “రామకృష్ణ పరమహంస”ని కలిసే వరకు వివేకానందుని ఆధ్యాత్మిక అన్వేషణకు సమాధానం దొరకలేదని, తదుపరి పూర్తి తత్వవేత్తగా అవతరించారని నాగరాణి వివరించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహానికి డైరెక్టర్, ఇతర అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ పాలిటెక్నిక్‌లలో నిర్వహించిన యువజనోత్సవాల క్లిప్పింగ్‌లతో కూడిన చలన దృశ్యాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో సాంకేతిక విద్యాశాఖ సంయుక్త సంచాలకులు వి.పద్మారావు, ఎస్బిటిఇటి కార్యదర్శి కె. విజయ భాస్కర్, డాక్టర్ ఎంఎవి. రామ కృష్ణ, డాక్టర్ కళ్యాణ్, డాక్టర్ నారాయణరావు, బి.జానకి రామయ్య, తదితరులు పాల్గొన్నారు.