కడప : ఈనెల 26 నుంచి ప్రజాక్షేత్రంలోకి వెళ్లబోతున్నామని ఏపీ పీసీసీ
అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత అభివృద్ధి
కోసం జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు చెప్పారు. వైఎస్సార్ జిల్లా పర్యటనలో
భాగంగా కడప నగరంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో రుద్రరాజు
మాట్లాడారు. రాహుల్‌గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’కు రాష్ట్రంలో అనూహ్య
స్పందన వచ్చిందన్నారు. జవనరి 26 నుంచి 2 నెలల పాటు పాదయాత్ర చేయనున్నట్లు
చెప్పారు. ‘‘రాష్ట్రంలో అన్యాయాలు, అక్రమాలు పెరిగాయి. కేబినెట్ మంత్రులకు
కూడా గౌరవం లేదు. సర్పంచ్‌లకు నిధులు, విధులు లేకుండా పంచాయతీరాజ్ వ్యవస్థను
నిర్వీర్యం చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మైనారిటీలు అభద్రతా
భావంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రథమ శత్రువు సీఎం జగన్. రాష్ట్ర
అభివృద్ధిపై ఆయనకు చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలి.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇతర
పార్టీల నేతలు మాతో టచ్‌లో ఉన్నారు. అవసరం వస్తే పార్టీలోకి వాళ్లు వస్తారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే పాదయాత్రకు అనుమతి కావాలని డీజీపీకి
వినతిపత్రం అందజేశాం. జీవో నంబర్ 1 సాకుగా చూపించి పాదయాత్రను అడ్డుకుంటే
ఏంచేయాలో తర్వాత ఆలోచిస్తాం అని రుద్రరాజు అన్నారు.