విజయవాడ : కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఢిల్లీ రైతు ఉద్యమం సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో దానికి నిరసనగా జాతీయస్థాయిలో సంయుక్త కిసాన్ మోర్చా పిలుపుమేరకు జనవరి 26 రిపబ్లిక్ డే రోజు రైతులతో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించాలని పిలుపు ఇచ్చిన నేపథ్యంలో దానిని అమలు చేయడానికి విజయవాడలోని ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో రైతు సంఘాలు, ప్రజాసంఘాల తో సమావేశం నిర్వహించారు. సమితి కన్వీనర్, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రిశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి ఇప్పటివరకు కార్పొరేట్ సంస్థలకు 10 లక్షల కోట్లు రుణమాఫీ చేసిందని స్వామినాథన్ కమిటీ సిఫారసుల ఆధారంగా సి 2+50శాతం ఫార్ములాను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తెస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడం చాలా దారుణమన్నారు. ఆల్ ఇండియా కిసాన్ సభ అధ్యక్షులు రావుల వెంకయ్య మాట్లాడుతూ ఢిల్లీ రైతుల ఉద్యమంలో అమరులైన 750 మంది రైతుల కుటుంబాలన్నిటికీ పరిహారం ఇవ్వాలని రైతులపై పెట్టిన 80 వేల కేసులు ఉపసంహరించాలని, సింఘు
బోర్డర్లో రైతు ఉద్యమానికి గుర్తుగా స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కె.వి.వి ప్రసాద్ మాట్లాడుతూ విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరించాలని కేరళ రాష్ట్రంలో అమలు చేసిన విధముగా రైతులకు సంపూర్ణ రుణ విముక్తి కలుగజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ
వెంకట గోపాల కృష్ణారావు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం గతంలో రాష్ట్ర ప్రభుత్వం 2018, 2019,2020లో నిర్ణయం తీసుకున్న మేరకు కృష్ణానది యాజమాన్యం బోర్డు (కె.ఆర్.ఎమ్ బి) కార్యాలయాన్ని కృష్ణా బేసిన్ విజయవాడలోనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.