నెల్లూరు : విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు, మెరుగైన ఆరోగ్యాన్ని అందించాలనే లక్ష్యంతో డాక్టర్ వైయస్సార్ చిరునవ్వు, కంటి వెలుగు కార్యక్రమాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము- కోల్గేట్ కంపెనీ సంయుక్తంగా నెల్లూరు జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన డాక్టర్ వైయస్సార్ చిరునవ్వు కార్యక్రమాన్ని పొదలకూరు జడ్పీ హైస్కూల్లో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్న ముఖ్యమంత్రి, వారి ఆరోగ్యం విషయంలో కూడా అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యార్థులకు సంబంధించి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సతీష్ రెడ్డి, కోల్గేట్ పామోలివ్ కంపెనీ సీఈవో ప్రభానరసింహన్, కోల్గేట్ కంపెనీ సిఎస్ఆర్ హెడ్ పూనం శర్మ, డి ఎం హెచ్ ఓ పెంచలయ్య, ఎంపీడీవో నగేష్ కుమారి, తాసిల్దార్ ప్రసాద్, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.