విజయనగరం : వచ్చే విద్యా సంవత్సరం 2023-24 నుంచి విజయనగరంలో ఏర్పాటు
చేస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలలో తరగతులు ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని వెల్లడించారు. విజయనగరం కళాశాల నిర్మాణం
పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. రూ.35 కోట్ల అంచనా వ్యయంతో
చేపడుతున్న తాత్కాలిక భవనాల నిర్మాణం దాదాపు యీ ఏడాది మార్చి నెలాఖరు నాటికి
పూర్తవుతుందని మంత్రి చెప్పారు. జిల్లా కేంద్రంలోని గాజులరేగ వద్ద నిర్మాణంలో
ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
సోమవారం డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి
శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య, వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి
ఎం.టి.కృష్ణ బాబు, ఏ.పి.ఎం.ఎస్.ఐ.డి.సి. ఎం.డి. మురళీదర్ రెడ్డి తో కలసి
పరిశీలించారు. వైద్య ఆరోగ్య మౌళిక సదుపాయాల సంస్థ అధికారులు, నిర్మాణ సంస్థ
ఎన్.సి.సి. ప్రతినిధులు నిర్మాణ పనుల ప్రగతిని మంత్రికి వివరించారు.
రాష్ట్రంలో నిర్మాణం పనులు ప్రారంభించిన ప్రభుత్వ కళాశాలల్లో మచిలీపట్నం,
ఇక్కడ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి
కృష్ణబాబు మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి విడదల రజని మీడియా ప్రతినిధులతో
మాట్లాడుతూ రాష్ట్రంలో 17 వైద్య కళాశాలల్ని కొత్తగా ఏర్పాటు చేయాలని
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంకల్పించారని దీనిలో భాగంగా రూ.500 కోట్ల
వ్యయంతో ఇక్కడ వైద్య కళాశాల ఏర్పాటవుతుందని చెప్పారు. 150 సీట్లతో వైద్య
కళాశాల వచ్చే ఏడాది ప్రారంభం అవుతుందని, తద్వారా ఈ ప్రాంత ప్రజలకు వైద్య విద్య
అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల
సంస్థ ఇ.ఇ సత్య ప్రభాకర్, ఆర్.డి.ఓ. సూర్యకళ, డి.ఎం.హెచ్.ఓ రమణ కుమారి, వైద్య
కళాశాల ప్రిన్సిపాల్ డా. పద్మ లీల తదితరులు పాల్గొన్నారు.