విశాఖపట్నం ఉత్తరాంధ్ర అభివృద్ధి శంకుస్థాపనలకు మాత్రమే పరిమితమైందని,
ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు పూర్తయిన దాఖలాలు లేవని జనసేన పార్టీ రాజకీయ
వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్య,
వైద్యం, వ్యవసాయం ఇలా ఏ రంగం తీసుకున్నా అభివృద్ధికి ఆమడ దూరంలో
నిలిచిపోయిందన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతం అక్రమ మైనింగ్ తవ్వకాలకు కేరాఫ్
అడ్రస్ గా మారిపోయిందన్నారు. ప్రకృతి వనరులను కొంతమంది స్వార్థపరులు తమ
స్వలాభం కోసం దోచుకుంటున్నారని అన్నారు. శనివారం ఉదయం విశాఖపట్నం దసపల్లా
హోటల్లో ఉత్తరాంధ్ర చర్చా వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మాజీ
పార్లమెంట్ సభ్యులు కొణతాల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో
డా.జయప్రకాష్ నారాయణ, చింతకాయల అయ్యన్న పాత్రుడు, గిడుగు రుద్రరాజు,
వి.శ్రీనివాసరావు, కె.రామకృష్ణ, ప్రొ. కె.ఎస్.చలం, పాకలపాటి రఘు వర్మ,
సత్యనారాయణ మూర్తి, భీశెట్టి బాబ్జీ, గోవింద రాజు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “ఉత్తరాంధ్ర యువత నిరాశ, నిస్పృహల్లో
కూరుకుపోయింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసమే కాదు.. చదువుల కోసం, కోచింగ్ ల
కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లే దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. శాసనసభ్యుడిగా
ఉన్న సమయంలో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఏజెన్సీలో విస్తృతంగా
పర్యటించాను. ఏజెన్సీలో గిరిజనులు పడుతున్న కష్టాలను స్వయంగా తెలుసుకున్నాను.
సభాపతి అయిన తరువాత గిరిజనుల అభివృద్ధి కోసం రూ. 5 వేల కోట్లతో అరకు
డిక్లరేషన్ తీసుకొచ్చామన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని చెప్పాం : విశాఖ స్టీల్ ప్లాంట్
ప్రైవేటీకరణ ప్రకటన రాగానే మొట్టమొదట స్పందించింది జనసేన పార్టీయే. పవన్
కళ్యాణ్ తో పాటు నేను ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిశాం. విశాఖ స్టీల్
ప్లాంట్ కోసం 32 మంది ప్రాణ త్యాగాలు, ఎందరో రైతుల భూమి త్యాగాలు చేశారని
వివరించాం. ప్రైవేటీకరణ నిర్ణయం విరమించుకోవాలని చాలా స్ట్రాంగ్ గా చెప్పాం.
కొంతమంది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదు.
పరిస్థితి చేయి దాటిపోయాక చేసేది ఏమీ ఉండదు. ఏ సందర్భంలో అయినా పోరాటం
చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఐటీ ఉత్పత్తుల్లో రాష్ట్రం తలెత్తుకోలేని
పరిస్థితి నెలకొంది. విశాఖలోని మధురవాడలోనూ, మిలీనియం టవర్స్ ఎ బ్లాక్ లో
రెండు లక్షల చదరపు అడుగుల ఖాళీ ఉంటే, కేవలం 1 లక్ష చదరపు అడుగులు మాత్రమే
ఇప్పటి వరకు వినియోగించగలిగారు. అలాగే మిలీనియం టవర్స్ బి బ్లాక్ లో 1.53
లక్షల చదరపు అడుగుల ఖాళీ ప్రదేశం అలాగే ఉండిపోయిందన్నారు.