విశాఖపట్నం : ఆరోగ్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం పలు సంస్కరణలను తెస్తోందని,
పేదలకు ఉన్నత వైద్య సేవలందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్ పలు చర్యలు
చేపట్టారని వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. అమెరికన్
అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజాన్(ఆపీ) ఆధ్వర్యంలో
విశాఖలో 16వ ప్రపంచ ఆరోగ్య సదస్సు (జీహెచ్ఎస్) ఘనంగా ప్రారంభమైంది. సీఎం
జగన్ వర్చువల్ విధానంలో సదస్సును ప్రారంభించాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల
రద్దయింది. సీఎం పంపిన సందేశాన్ని మంత్రి రజిని చదివి వినిపించారు. సదస్సు
విజయవంతంగా సాగాలని, వైద్య నిపుణులు చర్చించే అంశాలను ప్రభుత్వం అమలు
చేస్తుందని సీఎం పేర్కొన్నారు.
అనంతరం మంత్రి రజిని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ ఫిజిషియన్ వైద్య
విధానాన్ని ప్రారంభించిందని, వైద్య సేవలు ప్రజల చెంతకే చేరుతున్నాయని అన్నారు.
ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన, అత్యాధునిక వైద్య పరికరాల ఏర్పాటు సహా వివిధ
కార్యక్రమాలు చేపట్టేందుకు రూ.16వేల కోట్లతో ‘నాడు-నేడు’ పనులు చేపట్టినట్లు
తెలిపారు. పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ కరోనా వంటి
కొత్త వైరస్‌లను కనిపెట్టేందుకు పరిశోధనలు వేగవంతం చేయాలని సూచించారు.
ఆపీ అధ్యక్షుడు డాక్టర్ రవి కొల్లి మాట్లాడుతూ మానసిక ఆరోగ్యంపై అవగాహన,
ఆత్మహత్యల నివారణ, మాతాశిశు మరణాలకు అడ్డుకట్ట వేయడం, పోషకాహారంపై దృష్టి,
గ్రామీణ ఆరోగ్య కార్యక్రమాలు, హెచ్‌పీవీ టీకా కార్యక్రమం, వైద్య విద్యలో
సంస్కరణలు, కార్డియాక్ పునరుజ్జీవ కార్యక్రమాలపై సదస్సులో చర్చిస్తామన్నారు.
అనంతరం జీహెచ్ఎస్ సావనీర్‌ను ఆవిష్కరించారు. ఆపీ నిర్వాహక కమిటీ అధ్యక్షుడు
డాక్టర్ టి.రవిరాజు, ఆపీ అమెరికా అధ్యక్షుడు డాక్టర్ చలసాని ప్రసాద్,
ఆరోగ్యశాఖ కార్యదర్శి జీఎస్ నవీన్‌కుమార్, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్
జె.నివాస్, జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున, ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ
శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ తదితరులు పాల్గొన్నారు.