పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ
కొత్తగా జాబితాలో చేరింది 5,97,701 మంది
4,66,973 మంది పేర్ల తొలగింపు
1,30,278 మంది ఓటర్ల పెరుగుదల
వెలగపూడి : ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల సంఖ్య 3,99,84,868కు చేరింది. ఓటర్ల జాబితా
ప్రత్యేక సమగ్ర సవరణ-2023 చేపట్టిన ఎన్నికల సంఘం తుది జాబితాను
ప్రచురించింది. ముసాయిదా జాబితాతో పోలిస్తే తుది జాబితాలో 1,30,728 మంది
ఓటర్లు పెరిగారు. గతేడాది నవంబరు 9న విడుదల చేసిన ముసాయిదా జాబితాలో
3,98,54,093 మంది ఓటర్లు ఉండగా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టిన తర్వాత ఎన్నికల
సంఘం కొత్తగా 5,97,701 మంది ఓటర్లను జాబితాలో చేర్చింది. 4,66,973 మందిని
తొలగించింది. తుదిజాబితా ప్రకారం రాష్ట్రంలో పురుషుల కన్నా 4,61,966 మంది
మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. సమగ్ర సవరణ అనంతరం రాష్ట్రంలో నికరంగా 0.33%
ఓటర్లు పెరిగారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4 కోట్లకు 15,132 మంది ఓటర్లు తక్కువగా
ఉన్నారు. ఈ వివరాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్‌కుమార్ మీనా
వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 45,951 పోలింగ్ కేంద్రాలున్నాయి.
17 జిల్లాల్లో పెరుగుదల..9 జిల్లాల్లో తగ్గుదల : తుది జాబితాలో ఓటర్ల సంఖ్య 17
జిల్లాల్లో పెరగ్గా.. 9 జిల్లాల్లో తగ్గింది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో
30,824 మంది, ఎన్టీఆర్ జిల్లాలో 15,690 మంది, బాపట్ల జిల్లాలో 13,678 మంది
ఓటర్లు తగ్గారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 28,579 మంది, అనంతపురం జిల్లాలో
27,464 మంది, నంద్యాలలో 18,270 మంది ఓటర్లు పెరిగారు. అత్యధిక ఓటర్లు కలిగిన
జిల్లాల్లో కర్నూలు మొదటిస్థానంలో ఉండగా.. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా
అనంతపురం, నెల్లూరు జిల్లాలు ఉన్నాయి. అతి తక్కువ ఓటర్లున్న జిల్లాల్లో
అల్లూరి సీతారామరాజు జిల్లా తొలిస్థానంలో, పార్వతీపురం మన్యం జిల్లా
రెండోస్థానంలో ఉన్నాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం, ప్రకాశం, శ్రీ సత్యసాయి మినహా
అన్ని జిల్లాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ.
థర్డ్ జెండర్ కాకినాడ నగరం, కడప నియోజకవర్గాల్లోనే అత్యధికం : కాకినాడ నగర
నియోజకవర్గం పరిధిలో రాష్ట్రంలోనే ఎక్కువమంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 3,924 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉండగా కాకినాడ నగరంలో 139
మంది ఉన్నారు. రెండోస్థానంలోని కడప నియోజకవర్గంలో 99 మంది, మూడోస్థానంలోని
నంద్యాల నియోజకవర్గంలో 95 మంది ఉన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు,
శ్రీసత్యసాయి జిల్లా మడకశిర, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గాల్లో ఈ
ఓటర్లే లేరు.