అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించే గ్రూపు-1
ప్రిలిమ్స్(స్క్రీనింగ్ టెస్ట్)కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ చెప్పారు.
18 జిల్లాల్లో 297 కేంద్రాల్లో 1,26,499 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని,
మూడు వారాల్లోనే ఫలితాలు వెల్లడిస్తామన్నారు. నోటిఫికేషన్లో ప్రకటించిన 92
పోస్టులకు అదనంగా మరికొన్ని కలిసే అవకాశముందని చెప్పారు. కమిషన్ ప్రధాన
కార్యాలయంలో గౌతమ్‌సవాంగ్ విలేకర్లతో మాట్లాడారు. ‘గ్రూపు-1 ప్రధాన పరీక్షను
స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు వెల్లడించిన 90 రోజుల్లోగా నిర్వహిస్తాం.
జవాబుపత్రాల మూల్యాంకనానికి రెండు నెలలు పడుతుంది. తర్వాత నెలలో ఇంటర్వ్యూలు
నిర్వహించి, ఆగస్టులోగా నియామకాలు పూర్తిచేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి
పోస్టుల భర్తీకి ఆమోదం లభిస్తే ఈ ఏడాది సెప్టెంబరులో కొత్తగా మరో గ్రూపు-1
నోటిఫికేషన్ జారీచేస్తాం. త్వరలో గ్రూపు-2 నోటిఫికేషన్ ఇస్తాం’ అని గౌతమ్
సవాంగ్ వివరించారు.