విజయవాడ : ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గానికి ప్రభుత్వ
ఉత్తర్వులు, చట్టాలు వర్తిస్తాయాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన
కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. కుప్పం నా సొంత
నియోజకవర్గం, ఇక్కడి నుంచి ఏడుసార్లు గెలిచా అంటూ మాజీ ముఖ్యమంత్రి నారా
చంద్రబాబు నాయుడు పోలీసులపై బుధవారం రుబాబు చేయాలని చూడడం ఆంధ్రా ప్రజలకు
విస్మయం కలిగించిందని చెప్పారు. ‘రాష్ట్ర, పంచాయతీ రోడ్లపై రోడ్ షోలు
పెట్టవద్దు, పల్లెల్లో ఆ పనిచేయవచ్చు,’ అని కుప్పంలో పోలీసులు సలహా
ఇచ్చినప్పుడు టీడీపీ అగ్రనేత వారిపై మండిపడ్డరని చెప్పారు. నేను ఇన్ని సార్లు
ఇక్కడ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యా,అంతా నా ఇష్టం, అని అనడం చంద్రబాబు లాంటి
నాయకుడికి సరైనది కాదని హితవు పలికారు. ఏ నియోజకవర్గం నుంచి ఏ నాయకుడు
గెలిచినా రాష్ట్రంలోని అన్ని స్థానాల్లోనూ ఆయన పర్యటించవచ్చు,అలాగే
ప్రజలనుద్దేశించి ప్రసంగించవచ్చు. అయితే, అమలులో ఉన్న చట్టాలు, ప్రభుత్వ
ఉత్తర్వుల ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా నడచుకోవాల్సి ఉంటుందని 1995
నుంచి తెలుగుదేశం అనే రాజకీయపక్షం అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబుకు ఒకరు
చెప్పాల్సిన పనిలేదన్నారు. అధికారంలో ఉన్నది ఏ పార్టీ అనే విషయంతో సంబంధం
లేకుండా విధులు నిర్వర్తించే పోలీసు అధికారులు ఇలాంటి విషయాలు ఓ మాజీ
ముఖ్యమంత్రికి, ‘జాతీయ రాజధాని న్యూఢిల్లీలో చక్రం తిప్పానని’ చెప్పుకునే
సీనియర్ నేతకు చెప్పాల్సిరావడం నిజంగా సిగ్గుచేటున్నారు. మాజీ సీఎంకు అన్ని
నియోజకవర్గాలూ సమానమైనప్పుడు–చంద్రగిరి కన్నా కుప్పంపై ఎక్కువ అధికారం,
హక్కులు ఉంటాయా? అంటే– ఉండవనే చట్టం తెలిసినవారు జవాబిస్తారని తెలిపారు. ఎంతటి
గొప్ప రాజకీయ నాయకుడైనా తాను పుట్టి పెరిగిన సొంతూళ్లోగాని, అత్యధికసార్లు
గెలిచిన అసెంబ్లీ నియోజకవర్గంలో గాని ఆయనకు ప్రత్యేక హక్కులు, సౌకర్యాలు
ఉండవని చెప్పారు. అయితే, మూడున్నర మాసాల్లో 73 ఏళ్లు నిండుతున్న ఈ పెద్దాయన
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మరో విధంగా
పోలీసులు సహా ప్రభుత్వ అధికారులతో వ్యవహరించడం కొత్త విషయమేమీ కాదని
విజయసాయిరెడ్డి అన్నారు.