తిరుపతి : పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం అనేది భగవంతుడికి చేసే సేవలతో
సమానమని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ అన్నారు. గురువారం స్థానిక
ఎస్.వి.మెడికల్ కాలేజ్ అల్యూమిని అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పూర్వ
విద్యార్థులు ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీ శంకుస్థాపన చేసి, డా. సుబ్రమణ్యం,
సునీత, శ్రీధర్ రాజు, సుభాషిణి వారి ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన
ఆడిటోరియంను గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ప్రారంబించారు. ఈ సంధర్భంగా
గవర్నర్ మాట్లాడుతూ ఎస్వీ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం మెడికల్
స్టూడెంట్స్ కోసం డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు కొరకు నేడు తన చేతుల మీదుగా
పునాది వేయడం చాలా సంతోషంగా ఉన్నదని, వివిధ సూపర్ స్పెషాలిటీలపై అనేక జాతీయ,
అంతర్జాతీయ సదస్సులను విజయవంతంగా నిర్వహించడం కోసం డాక్టర్. రాయపు రమేష్ బాబు
నేతృత్వంలోని ఎస్వీ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు చేపట్టిన
కార్యక్రమాలను అభినందిస్తున్నానని అన్నారు.
తిరుపతి ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ మొదలైన సూపర్ స్పెషాలిటీ మెడిసిన్‌లోని
వివిధ రంగాలలో ఎస్ వి ఎం సి పూర్వ విద్యార్థుల సంఘం జాతీయ , అంతర్జాతీయ
సమావేశాలను నిర్వహించిందని, ఈ వైద్య రంగాలలో నిపుణులైన ఫ్యాకల్టీ సభ్యులు ఈ
సమావేశాలలో తమ ఉపన్యాసాలు ఇచ్చారని, దాదాపు 25,000 మంది ప్రతినిధులు
పాల్గొన్నారని నూతన వైద్య విదాన సమాచారం పంచుకున్నారని తనకు తెలిసిందని,
ప్రాక్టీస్ చేసే వైద్యులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థులు, ఐ ఎం ఎ
వైద్యులు, భారతదేశం, విదేశాలలోని మెడికల్ కాలేజీల బోధనా ఫ్యాకల్టీల ప్రయోజనం
కోసం , నైపుణ్యం కోసం గణనీయమైన సహకారం అందించి , పూర్వ విద్యార్థుల సంఘం
అందరిచే గుర్తింపు పొందిందన్నారు. ఈ సంఘం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీజీ నుండి
ప్రశంసలను పొందిందని తనకు తెలిసిందని, ఈ గొప్ప విజయం వెనుక ఉన్న డాక్టర్
రమేష్, టీమ్ సభ్యులను నేను అభినందిస్తున్నానని అన్నారు. తన ప్రసంగం ముగిస్తూ
కార్ల్ జంగ్ మాటలు గుర్తు చేస్తూ మందులు రోగాన్ని నయం చేస్తాయి కానీ డాక్టర్లు
మాత్రమే రోగులకు చికిత్స చేసి నయం చేయగలరు అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో
తిరుపతి పార్లమెంటు సభ్యులు మద్దిల గురుమూర్తి, గవర్నర్ స్పెషల్ సిఎస్ ఆర్పీ
సిసోడియా, కలెక్టర్ కె. వెంకట రమణ రెడ్డి, తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర
రెడ్డి, ఎస్.వి. మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు, డా.
ఆర్.రమేష్ బాబు, ఎస్.వి. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.ఎ.
చంద్రశేఖరన్, రుయా ఆసుపత్రి ఇంచార్జ్ సూపరింటెండెంట్ సురేశ్వర్ రెడ్డి,
ఎస్.వి. మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం విద్యార్థులు, డాక్టర్లు
తదితరులు పాల్గొన్నారు.