అమరావతి : జీవో నెం.1తో ప్రశ్నించే గొంతును అణచివేస్తున్న ఏ1 అంటూ మాజీ మంత్రి
యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ
హిట్లర్, తుగ్లక్, గోబెల్స్లకు ప్రతిరూపం జగన్ రెడ్డి అని అన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆర్టికల్ 19ను అడ్డుకొనే చట్టమే లేదన్నారు. రాష్ట్రపతి
అనుమతి లేకుండా ఇష్టానుసారంగా చట్టాలను మారుస్తున్నారని మండిపడ్డారు. బ్రిటీష్
కాలం నాటి యాక్ట్ 1861 ఉపయోగించి అర్ధరాత్రి చీకటి జీవో నెం.1ని జారీ చెయ్యడం
దుర్మార్గపు చర్య అని అన్నారు. ఈ ధోరణిని అరికట్టలేకపోతే ప్రజాస్వామ్య మనుగడ
పెను ప్రమాదంలో పడటం ఖాయమన్నారు. రాష్ట్రంలో 144, 30 సెక్షన్లు నిరంతరం అమలు
చేస్తూనే ఉన్నారని తెలిపారు. పాద యాత్రలు, దీక్షలను ఆనాడు టీడీపీ ప్రభుత్వం
అడ్డుకొంటే జగన్ రెడ్డి పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. జీవో తెచ్చిన జగన్
రెడ్డి రాజమండ్రిలో, విజయనగరంలో రోడ్డు షోలు, ర్యాలీలు చేశారన్నారు.
విద్యార్థులు, కార్మికులు, రైతులు, నిరుద్యోగులు, మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు
వారి సమస్యలపై శాంతియుత ప్రదర్శనలను అణచివేస్తున్నారని యనమల రామకృష్ణుడు
ఆగ్రహం వ్యక్తం చేశారు.