ఎమ్మెల్యే చేతులమీదుగా రూ. 5.30 లక్షల విలువైన ఎల్ఓసి పత్రం అందజేత
విజయవాడ: నిరుపేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా
భరోసా కల్పిస్తోందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్
ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 60 వ డివిజన్ వాంబేకాలనీకి చెందిన సయ్యద్
రసూల్ (9) పుట్టుకతోనే వినికిడి సమస్యతో బాధపడుతున్నారు. బాలుడి కుటుంబ ఆర్థిక
దుస్థితిని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా..
రూ. 5.30 లక్షల విలువైన ఎల్ఓసి మంజూరు చేయడం జరిగింది. ఆంధ్రప్రభ కాలనీలోని
జనహిత సదనము నందు ఎల్ఓసి పత్రాన్ని మంగళవారం ఎమ్మెల్యే చేతులమీదుగా అందజేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత
ఇస్తున్నారని ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. ప్రజలకు అన్ని రకాల వైద్య
సేవలు ఉచితంగా అందుబాటులోకి తేవాలనే కృతనిశ్చయంతో ఈ ప్రభుత్వం
పనిచేస్తున్నట్లు చెప్పారు. అలాగే అత్యవసర సమయంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య
సేవలు పొంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబాలను ముఖ్యమంత్రి సహాయనిధి
ద్వారా ఆదుకుంటున్నట్లు పేర్కొన్నారు. అదే చంద్రబాబు పాలనలో పేద రోగులు ఆర్థిక
భారంతో చితికిపోయేవారని.. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్
జగన్మోహన్ రెడ్డి చొరవతో ఆపదలో ఉన్న ప్రతిఒక్కరికీ ముఖ్యమంత్రి సహాయనిధి
అందుతోందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా గత మూడున్నరేళ్లలో 925 మందికి రూ. 4
కోట్ల 30 లక్షల 58 వేల రూపాయలకు సంబంధించి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసినట్లు
వెల్లడించారు. 90 మందికి రూ. 2 కోట్ల 43 లక్షల 22 వేల రూపాయలకు సంబంధించి
ఎల్ఓసి పత్రాలను అందించినట్లు చెప్పారు. మొత్తంగా రూ. 6 కోట్ల 73 లక్షల 80 వేల
లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. కనుక ఆపద వస్తే అధైర్యపడకుండా పేదలందరూ ఈ
పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరోవైపు అత్యవసర సమయాల్లో రోగులకు
ఆరోగ్యశ్రీ ఆస్పత్రులపై అవగాహన కల్పించేందుకు.. జనహిత సదనములో ఏర్పాటు చేసిన
హెల్ప్ డెస్క్ ను సద్వినియోపరచుకోవాలని సూచించారు. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న
తమకు చేయూతనిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే మల్లాది
విష్ణుకి లబ్ధిదారుని కుటుంబసభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.