టీడీపీ రాష్ట్ర అధ్యకుడు అచ్చెన్నాయుడు
గుంటూరు :అప్రజాస్వామికమైన జీవో నెం.1 ని వెంటనే రద్దు చేయాలని టీడీపీ రాష్ట్ర
అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు, ప్రజా
సంఘాలు నోరెత్తకుండా చేయాలనే ఉద్దేశమే జీవో 1 అన్నారు. ప్రజలు, పత్రికలు,
ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయకూడదు, తప్పుల్ని ఎత్తి చూపకూడదు అనడమనేది
ప్రజాస్వామ్యాన్ని హరించడమేనని తెలిపారు. స్వార్థ ప్రయోజనాల కోసం
ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడం దుర్మార్గమన్నారు. ఉద్యమం అనే మాట ఎంతో
పవిత్రమైనది. ప్రభుత్వ అన్యాయాలను, అవినీతిని, ప్రజా సమస్యలను ఎండగడుతూ
ప్రజాస్వామ్యం ప్రజలకు కల్పించే హక్కుల సాధనకు ఆయుధంగా ఉన్న ఉద్యమాలను
అణగదొక్కేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రజలు, ప్రజా
సంఘాలు, ప్రతిపక్షాలు అసలు సభలే పెట్టకూడదు, సమావేశాలు నిర్వహించకూడదు అనేలా
రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం దారుణమన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ
అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సభలు, సమావేశాలు, రోడ్ షోలకు ప్రజల నుంచి
అశేషమైన ప్రజాదరణ వస్తుండడంతో చూసి ఓర్చుకోలేకే జీవో నెం.1తో అధికార
దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. ఈ ప్రభుత్వ వేధింపులకు, ఆంక్షలకు భయపడేది
లేదు.. ప్రజా సమస్యలపై తెలుగుదేశం పార్టీ పోరాటం కొనసాగుతుందని, ప్రజలకు అండగా
నిలుస్తుందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.