బాబు మీటింగుల్ని బహిష్కరించాలి
మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్
నరసన్నపేట : చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి జనం బలవుతున్నారని మాజీ డిప్యూటీ
సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సోమవారం విడుదల చేసిన ఒక
ప్రకటనలో చంద్రబాబు, టీడీపీ తీరుని దుయ్యబట్టారు. వరుసగా బాబు సభల్లో ప్రజలు
ప్రాణాలు కోల్పోతుండటంతో ఆ పార్టీ మీటింగుల్ని ప్రజలు బహిష్కరించాలన్నారు.
బాధ్యులపై కేసులు నమోదు చేయాలని, కఠిన శిక్షలు పడేలా చూడాలని అన్నారు
చంద్రబాబు ఎక్కడ కాలు పెడితే అక్కడ నాశనమేనని విమర్శించారు. సభల కోసం జనాన్ని
తీసుకొచ్చి పిచ్చి పబ్లిసిటీ చేస్తున్నారని పేర్కొన్నారు. దీని కారణంగా
మొన్న ప్రకాశం జిల్లా కందుకూరులో ఎనిమిది మందిని బలిగొన్నారని, నిన్న
గుంటూరులో ముగ్గురు చావుకీ వారే కారణమని మండిపడ్డారు. కందుకూరు ఘటనకు
చంద్రబాబు, లోకేష్, రామోజీ రావు, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ5 బీఆర్ నాయుడులను
బాధ్యులను చేయాలని డిమాండ్ చేశారు. కానుకలు, చీరలు ఇస్తామని దొంగ మాటలు చెప్పి
జనాన్ని రప్పించుకొని ఓ నలుగురికి చీరలు పంచి హడావుడి చేశారని, తొక్కిసలాట
జరిగి ముగ్గురు మృతిచెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మరణాలకు ఎవరు బాధ్యత
వహిస్తారని ప్రశ్నించారు. బాధితుల ఉసురు చంద్రబాబుకు కచ్చితంగా తగులుతుందని
అన్నారు చనిపోయిన మహిళల కుటుంబాలకు చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని
ప్రశ్నించారు. బాబుకు సిగ్గు, శరం లేదని, తాను అధికారంలోకి రావడానికి ఎవరెలా
చచ్చినా అవసరం లేదని విమర్శించారు. కందుకూరు, గుంటూరు ఘటనలపై ప్రభుత్వం న్యాయ
విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ముందు ముందు ఇలాంటి ఘటనలు
జరగకుండా బాబు సభలపై నిషేధాజ్ఞలు విధించాలని కృష్ణదాస్ కోరారు.