ముగ్గురు మహిళలు మృతి
అమరావతి : గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వహించిన జనతావస్త్రాలు, సంక్రాంతి
కానుక పంపిణీలో విషాదం చోటు చేసుకుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అతిథిగా
హాజరై కొంతమందికి వేదికపై కానుకలు అందించి వెళ్లిపోయారు. ఆ తరువాత జరిగిన
పంపిణీలో తొక్కిసలాట సంభవించి ముగ్గురు మహిళలు మృతి చెందారు. పలువురు
గాయపడ్డారు. వాస భారతీయుడు ఉయ్యూరు శ్రీనివాస్ నేతృత్వంలోని ఉయ్యూరు ఫౌండేషన్
ఆధ్వర్యంలో గుంటూరు సదాశివనగర్‌లోని వికాస్ హాస్టల్ మైదానంలో పేదలకు
సంక్రాంతి కానుకలు, దుస్తులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. టీడీపీ అధినేత
చంద్రబాబు కార్యక్రమానికి హాజరై కొందరికి కానుకలు అందించారు. ఆయన అక్కడి నుంచి
వెళ్లిన తరువాత నిర్వాహకులు పంపిణీ ప్రారంభించారు. కానుకల కోసం ఒక్కసారిగా
తోసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏటీ అగ్రహారానికి చెందిన 52ఏళ్ల
గోపిదేశి రమాదేవి చనిపోయారు. గాయపడిన సయ్యద్ ఆసియా, షేక్ జాన్‌బీ ఆసుపత్రిలో
చికిత్స పొందుతూ మరణించారు.
మొత్తం 12 లారీల్లో కానుకలు తీసుకువచ్చి నిర్వాహకులు 24 కౌంటర్ల ద్వారా పంపిణీ
మొదలుపెట్టారు. ప్రతి కౌంటర్ వద్దకు వెళ్లడానికి ఒకదారి, కానుక తీసుకున్న
తర్వాత తిరిగి రావడానికి పక్కనే దారి ఉండేలా బారికేడ్లు ఏర్పాటుచేశారు. అయితే
రెండు మార్గాల్లోనూ ఒక్కసారి మహిళలు కానుకలు తీసుకునేందుకు ఎగబడ్డారు. వేలమంది
కౌంటర్ల వద్దకు రావడంతో వాలంటీర్లు, పోలీసులు నియంత్రించలేకపోయారు. తోపులాటకు
బారికేడ్లు ఒరిగిపోయి కొందరు వాటికింద పడిపోయారు. అక్కడి నుంచి బయటపడే క్రమంలో
మిగతావారు కిందపడినవారిని తొక్కుకుంటూ వెళ్లిపోయారు. పోలీసులు, నిర్వాహకులు
కిందపడిన వారిని కష్టం మీద పైకి లేపారు. మహిళలు కాపాడాలని కేకలు వేయడంతో
పోలీసులు మరో బారికేడు తొలగించారు. దాంతో అందరూ అటుగా వెళ్లడానికి
ప్రయత్నించడంతో అక్కడా తొక్కిసలాట జరిగింది. సుమారు 30 నిమిషాలు గందరగోళం
నెలకొంది. జనం రద్దీ ఎక్కువగా ఉండటంతో ఘటనాస్థలానికి అంబులెన్స్ రావడానికి
కూడా సమయం పట్టింది.కానుకల పంపిణీ కోసం ఉయ్యూరు ఫౌండేషన్ వారం రోజుల నుంచి
ఏర్పాట్లు చేసింది. 30వేలమందికి కిట్లు లారీల్లో తీసుకువచ్చారు. ఎక్కువమంది
తరలివస్తారనే అంచనాతో భారీ మైదానాన్ని కార్యక్రమానికి ఎంచుకున్నారు. పేదలకు
ఇళ్ల వద్దే టోకన్లు ముందస్తుగా పంపిణీ చేశారు. టోకన్లు లేనివారూ సభకు
తరలిరావడంతో అందరికీ కానుకలు ఇస్తామని నిర్వాహకులు ప్రకటించారు. అయినప్పటికీ
కానుకల కోసం ఒక్కసారిగా తోసుకురావడంతో ప్రమాదానికి దారి తీసిందని పోలీసులు
తెలిపారు.ఘటనా స్థలాన్ని గుంటూరు కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. రాంబాబు అనే
వ్యక్తి ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీసులు సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి
దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి నైతిక బాధ్యత వహిస్తున్నట్లు ఉయ్యూరు ఫౌండేషన్ ప్రకటించింది. మరణించిన వారికి
ఒక్కొక్కరికీ 20లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని, గాయపడిన వారికి వైద్య ఖర్చులు
ఫౌండేషన్ భరిస్తుందని ఉయ్యూరి శ్రీనివాస్ ప్రకటించారు.