ఆర్టీసీ ఎం.డి ద్వారకా తిరుమల రావు
విజయవాడ : 2022 సంవత్సరంలో మీ అందరి సమిష్టి కృషి ఫలితంగా సంస్థలో ఉత్తమ
గణాంకాలు నమోదయ్యాయి, అదే స్పూర్తిగా తీసుకుని ఈ కొత్త సంవత్సరం కూడా మనందరం
సమిష్టిగా కష్టపడదామని సంస్థ ఎం.డి ద్వారకా తిరుమల రావు అన్నారు. ఆదివారం
ఆర్టీసీ హౌస్ లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో ఆయన పాల్గొని కేక్ కట్
చేసి ఉద్యోగులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం
ఉద్యోగులనుద్దేశించి ప్రసంగించారు.
2022 సంవత్సరం మనమందరం గుర్తుంచుకోవలసిన సంవత్సరమని టిక్కెట్ రెవెన్యూ పరంగా,
కార్గో ఆదాయ పరంగా గత ఏడాది సాధించిన ఆదాయాన్ని దాటేసామని తెలిపారు.
ట్రాఫిక్ సిబ్బంది ప్రయాణీకులకు ఉత్తమ సేవలు అందించడం, ఇటు కార్గో డోర్
డెలివరీ ద్వారా వినియోగదారుల మన్ననలు పొందడం వల్ల ఈ ఘనత సాధించామన్నారు. అంతే
కాకుండా మన సంస్థలో కొత్తగా ప్రవేశపెట్టిన యుటిఎస్ సేవలు ఇతర రాష్ట్ర
ఆర్టీసీలకు కూడా ఆదర్శప్రాయంగా మారాయని పేర్కొన్నారు. ఇతర ఆర్టీసీ లు ఇక్కడకి
వచ్చి అధ్యయనం చేయాలనుకోవడం మనం సాధించిన ఘనతగా చెప్పుకోవచ్చు. ఇక సంస్థ పరంగా
ఉన్న బకాయిలు క్రమక్రమంగా తీర్చుకుంటూ ముందుకి వెళ్తున్నాము. పీఎఫ్, సీసీఎస్
బకాయిలు తీరడం ద్వారా లోన్ కి దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు కేవలం 2-3
రోజుల్లోనే వారి బ్యాంకు అకౌంట్లలో జమ అవ్వడం జరుగుతుందన్నారు.
2022 లో మంచి ఫలితాలు సాధించాము కదా అని పొంగిపోకుండా, రాబోయే కాలంలో
ఇంతకుమించి సాధించాలనే పట్టుదలతో అందరం సమిష్టిగా కృషి చేస్తే, మన సంస్థపై
ప్రభుత్వానికి నమ్మకం కలిగి ఇంకేదైనా మేలు చేయాలని ఆలోచిస్తుందని వివరించారు.
చివరగా ఈ నూతన సంవత్సరాన్ని ఆనందంగా ఆహ్వానిస్తున్నామని ఇదే ఉత్సాహంతో సంస్థ
అభివృద్ధికి, ప్రతి ఒక్క ఉద్యోగి తమతమ గురుతర బాధ్యతలు నిర్వర్తించాలని
తెలిపి, ఈ కొత్త సంవత్సరం కూడా అందరికీ మంచి జరగాలనే ఆశాభావం వ్యక్తం చేశారు.
సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఏ) ఏ. కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ
కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఓ) కే.ఎస్. బ్రహ్మానంద రెడ్డి,
ఓ.ఎస్.డి. (కార్గో & లాజిస్టిక్స్ ) రవి వర్మ, అసిస్టెంట్ డైరెక్టర్ (వి &
ఎస్.) శోభా మంజరి, విజయవాడ పి.ఎన్.బి.ఎస్. ( ఏ.టి.ఎం.) బషీర్, ఆర్టీసీ హౌస్
ఉన్నతాధికారులు, వివిధ విభాగాల అధికారులు, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు,
ఉద్యోగులు, విజయవాడ పి.ఎన్.బి.ఎస్. సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.