విజయవాడ : అక్షర క్రమంలోనే కాకుండా అక్షరాస్యతలోనూ ఆంధ్రప్రదేశ్ ను
అగ్రస్థానాన నిలపడమే లక్ష్యంగా విద్యారంగంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక
సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు,
సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అరండల్ పేట ఎ.పి.జె.అబ్దుల్ కలాం
ఉర్దూ ప్రభుత్వ పాఠశాలలో 23 మంది 8 వ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు
స్థానిక కార్పొరేటర్ బంకా శకుంతల భాస్కర్ తో కలిసి శుక్రవారం ఆయన ట్యాబ్ లను
పంపిణీ చేశారు. ఈ సందర్భంగా “థ్యాంక్యూ జగన్ మామ” అంటూ చిన్నారులు చేసిన
నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ
చదువుతోనే పేదరికాన్ని నిర్మూలించగలమని బలంగా నమ్మే వ్యక్తి సీఎం
జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. కనుకనే రాష్ట్రంలో విద్యను అభ్యసించే
వారి శాతాన్ని పెంచేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ప్రాథమిక
విద్య నుంచి విదేశీ విద్య వరకు అన్ని దశలలోనూ చేయూతనందిస్తూ
విద్యార్థులకు ఉచిత విద్యనందిస్తున్నట్లు వెల్లడించారు. నూతన విద్యా విధానం
కోసం రూ. 53 వేల కోట్లు ఖర్చు చేయడం దేశంలోనే ప్రప్రథమని మల్లాది విష్ణు
అన్నారు. మరోవైపు పాదయాత్ర సమయంలో ప్రభుత్వ పాఠశాలల దయనీయ పరిస్థితిని స్వయంగా
గమనించిన ఆయన అధికారంలోకి వచ్చిన వెనువెంటనే వాటిని సర్వాంగ సుందరంగా
తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. మంచినీటి సదుపాయం, మరుగుదొడ్లు, విద్యుత్
సదుపాయం, లైట్లు, ఫ్యాన్లు, బెంచీలు, ఫర్నీచర్, గ్రీన్ చాక్ బోర్డులు,
పెయింటింగ్, ఇంగ్లీష్ ల్యాబ్స్, ప్రహరీ గోడలతో అధునాతనంగా ముస్తాబు
చేస్తున్నట్లు వెల్లడించారు. భావితరాల భవిష్యత్ ను ఉన్నతంగా
తీర్చిదిద్దాలన్నదే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని ఈ సందర్భంగా
పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మధుసూదన్, నాయకులు అబ్దుల్
నజీర్, నాగేశ్వరరెడ్డి, యక్కల శంకర్, యక్కల మారుతి, మహమ్మద్ రఫీ, లక్ష్మణ,
ఉల్లి ప్రసాద్, చల్లా సుధాకర్, పాఠశాల సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.