విజయవాడ : ఆయా విద్యాసంస్ధల ఉన్నతికి పూర్వ విధ్యార్ధులు తమ శక్తిమేర సహకరించి
విద్యాదానంలో భాగస్వామలు కావాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సంఘం వెబ్ సైట్,
లోగోను గురువారం రాజ్ భవన్ వేదికగా గవర్నర్ ఆవిష్కరించారు. త్వరలో జరగబోయే
పూర్వ విద్యార్థుల మెగా సమ్మేళనానికి సంబంధించిన గోడ పత్రికను కూడా విడుదల
చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ పలు విద్యా సంస్ధలలో ఇప్పటికే
పూర్వవిద్యార్ధుల సంఘాలు క్రియా శీలకంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నాయని, అదే
రీతిన నాగార్జునా విశ్వవిద్యాయలం సంఘం కూడా మంచి పనితీరును కనబరచాలని
ఆకాంక్షించారు. విద్యా సంస్ధలలో భవన నిర్మాణం మొదలు, పేద విద్యార్ధులకు సహాయం
వంటి అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రధానంగా విదేశాలలో స్ధిరపడిన
పూర్వవిద్యార్ధులు తగిన సహకారం అందించాలని పేర్కొన్నారు. ఆచార్య నాగార్జున
విశ్వవిద్యాలయం తీసుకుంటున్న విభిన్న కార్యక్రమాల గురించి విశ్వవిద్యాలయం
ఉపకులపతి అచార్య రాజశేఖర్ గవర్నర్ కు వివరించారు. ముఖ్యంగా పూర్వ విద్యార్థుల
సంఘ ద్వారా చేపడుతున్న పలు అభివృద్ధి గవర్నర్ కు విశదీకరించారు. ఈ
కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, రెక్టర్
అచార్య వరప్రసాద మూర్తి, రిజిస్ట్రార్ అచార్య బీ కరుణ, ఇంజనీరింగ్ కాలేజీ
ప్రిన్సిపాల్ అచార్య సిద్దయ్య, పూర్వ విద్యార్థుల సంఘం సంచాలకులు ఆంజనేయులు,
సమన్వయకర్త అచార్య సరస్వతి, దూరవిద్యా కేంద్రం సంచాలకులు నాగరాజు, రాజ్ భవన్
సంయిక్త కార్యదర్శి సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.