ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి అమర్నాథ్
విశాఖపట్నం : విశాఖలో ఫిబ్రవరి 16, 17 తేదీల్లో నిర్వహించనున్న ‘గ్లోబల్
టెక్ సదస్సు’తో నగరానికి అంతర్జాతీయ గుర్తింపు రానుందని ఐటీ, పరిశ్రమలశాఖ
మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి
వెయ్యిమంది ప్రతినిధులు, పలు సంస్థల సీఈవోలు వస్తారని తెలిపారు. విశాఖలో
నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐ.బి.ఎం.ను విశాఖ
తీసుకురావడానికి వీలుగా ముఖ్యమంత్రితో ఫిబ్రవరిలో అమెరికా వెళ్లి చర్చలు
జరపాల్సి ఉందని తెలిపారు. అమెజాన్, ఇన్ఫోసిస్‌లు విశాఖలో కార్యకలాపాల్ని
రానున్న రోజుల్లో విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. హెచ్.సి.ఎల్.
విశాఖతోపాటు గుంటూరు, కాకినాడ, తిరుపతి తదితరచోట్ల కార్యాలయాలు ఏర్పాటు
చేయనుందని తెలిపారు. పల్సస్ గ్రూపు ఎండీ, సీఈవో గేదెల శ్రీనుబాబు మాట్లాడుతూ
విశాఖ ఐటీకి మరింత గుర్తింపు వచ్చేలా ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ టెక్
సదస్సులు నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి
అమర్నాథ్ సదస్సు గోడపత్రికను, ప్రోమోను విడుదల చేశారు.