న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా
రాష్ట్రానికి సంబంధించిన పలు కీలకాంశాలపై ప్రధాని మోదీతో చర్చించారు సీఎం
జగన్. ముందుగా కోవిడ్ తాజా పరిణామాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా
ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రధానికి వివరించారు. ఆపై రాష్ట్ర
విభజన జరిగి 8 ఏళ్ల సుదీర్ఘకాలం గడిచినప్పటికీ విభజన చట్టంలో పేర్కొన్న
అంశాల్లో చాలావరకు ఇప్పటికీ నెరవేర్చలేదని, పైగా రెండు రాష్ట్రాల మధ్య ఇంకా
చాలా అంశాలు అపరిష్కృతంగానే ఉన్నాయని సీఎం జగన్, ప్రధానికి వివరించారు. గతంలో
చేసిన విజ్ఞప్తి మేరకు విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న అంశాలు, పార్లమెంటు
వేదికగా రాష్ట్రానికి ఇచ్చిన హామీలు, రాష్ట్రానికి సంబంధించిన ఇతర హామీలపై
కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ పలుమార్లు సమావేశం
అయ్యిందని, అయినప్పటికీ కొంత పురోగతే కనిపిస్తోందని, కీలకాంశాలు మాత్రం
ఇప్పటికీ పరిష్కారం కాలేదని సీఎం జగన్ ప్రధానికి వివరించారు. 2014–15 ఆర్థిక
సంవత్సరానికి సంబంధించి రీసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద చెల్లించాల్సిన బకాయిలు
అలానే ఉన్నాయని, 2014–15 సంవత్సరానికి సంబంధించిన రూ.18,330.45కోట్ల బిల్లులు,
10వ వేతన సంఘం బకాయిలు, పెన్షన్లు మొదలైన వాటి రూపేణా మొత్తంగా రూ. 32,625.25
కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని వెంటనే మంజూరు చేయాలని ప్రధాని
మోడీని కోరారు. గత ప్రభుత్వం పరిమితికి మించి అధికంగా చేసిన రుణాలను, ఈ
ప్రభుత్వంలో సర్దుబాటు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ, రుణాలపై పరిమితి
విధిస్తోంది. కేటాయించిన రుణ పరిమితిలో కూడా కోతలు విధిస్తోంది. ఈ ప్రభుత్వం
ఎలాంటి తప్పులు చేయనప్పటికీ గత ప్రభుత్వం చేసిన దానికి ఆంక్షలు విధిస్తోంది.
కోవిడ్‌లాంటి విపత్కర పరిస్థితుల్లో ఈ ఆంక్షలు రాష్ట్రాన్ని బాగా
దెబ్బతీస్తాయి. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని సీఎం జగన్, ప్రధానిని కోరారు.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులనుంచి ఖర్చు
చేసిన రూ.2,937.92 కోట్ల రూపాయలను రెండేళ్లుగా చెల్లించలేదు. ఈ డబ్బును
వెంటనే చెల్లించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా కల్పనపై
సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరిన ముఖ్యమంత్రి. విభజన వల్ల తీవ్రంగా
నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా అవశ్యమని, పార్లమెంటు వేదికగా
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని సీఎం పునరుద్ఘాటించారు.