విజయవాడ : దేశంలోనే మొట్ట మొదటిసారిగా స్మార్ట్ మీటర్ తో పాటు సంబంధిత పరికరాలు, సామాగ్రి కూడా రాష్ట్రప్రభుత్వమే అందిస్తున్నదని ఆంధ్రప్రదేశ్ ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ తెలిపారు. రైతులకు సాధికారిత కల్పిస్తూ ఏ రాష్ట్రంలో లేని విధంగా మీటర్ ఒక్కటే పెట్టడం కాకుండా రైతుల సంరక్షణ కూడా ప్రభుత్వమే తీసుకుందన్నారు. స్మార్ట్ మీటర్ల వల్ల రైతులు ఎవరు ఎంత సమయం వినియోగించారో తెలుసుకోవచ్చని, తద్వారా 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ కోసం అధికారులను కూడా ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు. విజయవాడలో గుణదలలోని విద్యుత్ సౌధలో మంగళవారం మీడియా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో స్మార్ట్ మీటర్లు అంటే ఏమిటి, స్మార్ట్ మీటర్లలో ఉపయోగించే టెక్నాలజీలు, స్మార్ట్ మీటర్ల వల్ల ప్రయోజనాలు, వేరే ఇతర మీటర్లు ఎందుకు వినియోగించడం లేదు తదితర అంశాలపై సమగ్రంగా వివరించారు.
ఈ సందర్బంగా ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్ల వల్ల రైతులు తాము వాడిన విద్యుత్తుకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో అందుకున్న సొమ్మును తామే నేరుగా డిస్కమ్‌లకు చెల్లిస్తారన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీసీపీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జె. పద్మజనార్థన రెడ్డి మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల పనితీరును ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ట్రాన్స్ కో సీఎండీ , ఏపీ జెన్ కో ఎండీ బి. శ్రీధర్, ఇంధన శాఖ డిప్యూటీ కార్యదర్శి బి.ఏ.వి.పి. కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.